ఎంపీ అతస్యపు ఆరోపణలు మానుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:48 PM
పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలనే ధ్యాస ఎలాగూ లేదు.. నీవు చేయని పనులు చేసినట్లు, జరుగుతున్న పనులన్నీ కేంద్రం నిధులతోనే, నీ కృషితోనే అంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలంటూ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

కరీంనగర్ టౌన్, జనవరి 12: పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలనే ధ్యాస ఎలాగూ లేదు.. నీవు చేయని పనులు చేసినట్లు, జరుగుతున్న పనులన్నీ కేంద్రం నిధులతోనే, నీ కృషితోనే అంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలంటూ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కేంద్రం నిధులు రూ. 155 కోట్లతోనే జరుగుతున్నాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదంటూ ఎంపీ బండి సంజయ్ చేసిన వాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్, వినోద్‌కుమార్ ఎలాగైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయించడంతో కార్పొరేషన్ పరిధిలోకి రావడంతోనే రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారని అన్నారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి 155 కోట్ల రూపాయల కేంద్రం నిధులతోనే ఆర్వోబీ చేపడుతున్నామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కూడా లేదంటూ వాఖ్యానించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 26 కోట్లు తమ వాటా నిధులను కేటాయించిందంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను మీడియాకు చూపించారు. అవాస్తవాలను ప్రజలకు తెలుపడాన్ని ఖండిస్తున్నామనిచెప్పారు. ఆనాటి మంత్రి గంగుల కమలాకర్, వినోద్‌కుమార్ దూరదృష్టితో తీగలగుట్టపల్లిని కార్పొరేషన్‌లో కలుపడం వల్లనే ఆర్వోబి వచ్చిందని అన్నారు. సంబంధం లేని స్మార్ట్‌సిటీ, హన్మకొండ రహదారిని తెచ్చామని చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.