Share News

ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌ చేసిందేమి లేదు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:00 AM

ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌కు గానీ, పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక అంబేద్కర్‌ స్టేడియంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మార్నింగ్‌ వాక్‌ చేస్తూ వాకర్స్‌ను కలిసి ఎంపీగా తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.

ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌ చేసిందేమి లేదు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 26: ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌కు గానీ, పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక అంబేద్కర్‌ స్టేడియంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మార్నింగ్‌ వాక్‌ చేస్తూ వాకర్స్‌ను కలిసి ఎంపీగా తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు లక్షల చొప్పున రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తెచ్చి జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజలకు 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన మోదీ కనీసం 15 రూపాయలు కూడా ఖాతాల్లో జమచేశారా అని ప్రశ్నించారు. ఎంపీగా ఏమి చేశావో చెప్పమని బండి సంజయ్‌ని అడిగితే కేంద్ర పథకాల నుంచి నిధులు తెచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్లు తోట రాములు, అయిలేందర్‌యాదవ్‌, నాయకులు కలర్‌ సత్తన్న, సత్తినేని శ్రీనివాస్‌, వొల్లాల శ్రీనివాస్‌గౌడ్‌, బెజగం మధు, చొక్కారపు చంద్రం, రవినాయక్‌, కెమసారం తిరుపతి, జిఎస్‌ ఆనంద్‌, గూడెల్లి రాజ్‌కుమార్‌, దూలం సంపత్‌, అంజియాదవ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు

కాంగ్రెస్‌, బీజేపీలకు రైతులు వ్యతిరేకంగా మారడంతో ఆ రెండు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుక ఉండాలని, వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఒకే పార్టీ వారైతే అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందనిఅన్నారు. హిందువునని చెప్పుకునే బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌కు ఒక గుడి తేలేదని, ఒక బడి తేలేదన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ, రైల్వేలైను, జాతీయ రహదారులు తెచ్చిన ఘనత తమదేనన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలతమహేశ్‌, తోట తిరుపతి, కీరంనగర్‌, కొత్తపల్లి మండలాల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కాసారపు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎఎంసీ చైర్మన్‌ రెడ్డివేణి మధు, కో అప్షన్‌ సభ్యుడు సాబీర్‌ పాషా, వైస్‌ఎంపీపీ తిరుపతి నాయక్‌, సుంకిశాల సంపత్‌రావు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ఓటేసి కయ్యలో పడొద్దు...

కరీంనగర్‌ టౌన్‌/గన్నేరువరం: కాంగ్రెస్‌కు ఓటేసి కయ్యలో పడొద్దని, బీజేపీకి ఓటు వేసి మోసపోవద్దని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి వినోద్‌కుమార్‌ ప్రసంగించారు. ఐదేళ్ళలో బండి సంజయ్‌కుమార్‌ ఎంపీగా ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని, మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కి అభివృద్ధి చేయడం చేతగాక పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ అసమర్థత కారణంగానే కరీంనగర్‌కు వచ్చిన ట్రిపుల్‌ ఐటీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తరలించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు ప్రతి ఏటా వచ్చే నిధులు సంజయ్‌ తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 2014లో ఎంపీగా ఉన్న సమయంలో కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైను, కరీంనగర్‌కు స్మార్ట్‌సిటి, టిటిడి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి 332 ఎకరాల ఫారెస్టు భూములను అప్పగించడం జరిగిందని వినోద్‌కుమార్‌ తెలిపారు. సంజయ్‌ ఎప్పుడు మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తారని, వేములవాడ, కొండగట్టు ఆలయాలకు నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఐదేళ్ళలో సంజయ్‌ జడ్పీ మీటింగ్‌కు కూడా హాజరుకాలేదని, రెచ్చగొట్టె వాఖ్యలతో యువత జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. యాసంగి పంటకు క్వింటాల్‌కు 500 బోనస్‌ ఇస్తామని, ఇప్పుడు ఇవ్వకుండా దాటవేసే ధోరణితో రైతులను మోసం చేసిందని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నపుడు గన్నేరువరం మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశానని, గన్నేరువరం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు 72 కోట్ల రూపాయలను డబుల్‌ రోడ్‌ మంజూరీ చేయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు సాగనివ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, వైఎస్‌ ఎంపీపీ స్వప్న సుధాకర్‌, రెడ్డవేని తిరుపతి, గడ్డం నాగరాజు, మాజీ సర్పంచు లక్ష్మి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:00 AM