Share News

ప్రజల సెంట్‌మెంట్‌తో గేమ్‌ ఆడుతున్న మోదీ

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:00 AM

మతం అనే సెంటిమెంట్‌ పేరిట మోదీ ప్రజలతో గేమ్‌ ఆడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. సోమవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తూ జిల్లా కేంద్రంలో కాసేపు కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు.

ప్రజల సెంట్‌మెంట్‌తో గేమ్‌ ఆడుతున్న మోదీ
సిరిసిల్లలో మాట్లాడుతున్న హనుమంతరావు

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 3: మతం అనే సెంటిమెంట్‌ పేరిట మోదీ ప్రజలతో గేమ్‌ ఆడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. సోమవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తూ జిల్లా కేంద్రంలో కాసేపు కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని, మోదీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకే ప్రయోజనం కలుగుతుందని అన్నారు. గతంలో కేదార్‌నాథ్‌, మొన్న కన్యాకుమారీకి వెళ్లి స్వామి వివేకానంద దగ్దర కూర్చొని మోదీ ధ్యానం చేశారని, వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారని, నరేంద్ర మోదీ హిందువులపైనే ఎక్కువ ఆలోచన చేస్తూ దేశంలోని మతాలను విడదీయాలన్న ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మతాల పేరిట రెచ్చగొడుతున్నారన్నారు. మతం అనే సెంటిమెంట్‌ పేరిట మోదీ ప్రజలతో గేమ్‌ ఆడుతున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున ఇండియా కూటమి ఆధిక్యతను సాధించాలని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏకు మొగ్గు చూపుతున్నాయని, మీడియా నరేంద్ర మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని, ఆ ప్రభావం కూడా ప్రజలపై పడవచ్చని అన్నారు. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను తాము నమ్మడం లేదన్నారు. నరేంద్ర మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, బ్లాక్‌ మనీ తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. నాడు ప్రధాన మంత్రి జవహుర్‌లాల్‌ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను తీసుకొచ్చి ప్రభుత్వ సంస్థలను ఏర్పటు చేశారని, ప్రజలకు ఉపాధి కల్పించారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ సంస్థలను ఆదాని వంటి కార్పొరేటర్లకు అప్పగించారని మండిపడ్డారు. రెండు సార్లు ఎన్నికవడంతో దేశ రాజకీయాలు చేయాలని కేసీఆర్‌ తప్పు చేశాడన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు ఆలోచన చేయలేదని, పంజాబ్‌, బీహార్‌కు వెళ్లి అక్కడి రైతులకు సహాయం చేసి తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో పంట నష్టపోయిన రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేయించారని, మహారాష్ట్రకు వెళ్లి ఆప్‌కీ బార్‌ కిసాన్‌కీ సర్కార్‌ అని ప్రచారం చేశాడని అన్నారు. సోనియాగాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు, ఉద్యమం చేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ కౌన్సిలర్‌ ఆడెపు చంద్రకళ, నాయకులు గౌస్‌, నర్సయ్య, ఆడెపు ప్రభాకర్‌, శ్రీనివాస్‌, నీలి రవీందర్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:00 AM