Share News

వెక్కిరిస్తున్న పర్యాటకం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:42 AM

కార్మిక, ధార్మిక, అధ్యాత్మిక కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పర్యాటక సోబగులకు గత సంవత్సరం జల విహారం ప్రారంభోత్సవంతో తొలి అడుగు పడిందని భావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడిన ఎత్తిపోతల అవాంతరాలతో మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరిపోయి జల విహారం వెక్కిరిస్తోంది. గత సంవత్సరం ఆగస్టు 18న అప్పటి మంత్రులు కే తారకరామారావు, శ్రీనివాస్‌గౌడ్‌ సిరిసిల్ల బ్యాక్‌ వాటర్‌ కరకట్ట వద్ద బోటు విహారాన్ని ప్రారంభించారు.

వెక్కిరిస్తున్న పర్యాటకం

- ప్రారంభోత్సవానికే పరిమితమైన మిడ్‌ మానేరు జలవిహారం

- కార్మిక, ఆధ్యాత్మిక క్షేత్రానికి... పర్యాటక సొబగులు దూరమేనా

- జిల్లాలో మిడ్‌మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌ల వద్ద ప్రతిపాదనలు

- అనంతగిరి ప్రాజెక్ట్‌లో 40 ఎకరాల్లో ఐలాండ్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కార్మిక, ధార్మిక, అధ్యాత్మిక కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పర్యాటక సోబగులకు గత సంవత్సరం జల విహారం ప్రారంభోత్సవంతో తొలి అడుగు పడిందని భావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడిన ఎత్తిపోతల అవాంతరాలతో మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరిపోయి జల విహారం వెక్కిరిస్తోంది. గత సంవత్సరం ఆగస్టు 18న అప్పటి మంత్రులు కే తారకరామారావు, శ్రీనివాస్‌గౌడ్‌ సిరిసిల్ల బ్యాక్‌ వాటర్‌ కరకట్ట వద్ద బోటు విహారాన్ని ప్రారంభించారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు జల విహారం కోసం సిరిసిల్ల ప్రజలు ఎదురుచూసినా ప్రారంభంతోనే ముగిసిపోయింది. అప్పటి మంత్రులు మాత్రం జల విహారం చేసినా బోట్లు కొనసాగకుండానే మూలన పడ్డాయి. తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకుండా నీటి నిల్వలు తగ్గిపోయాయి. వేమువాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రసిద్ధి చెంది ఆధ్యాత్మికతకు పర్యాటకం తోడవుతుందని భావించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సిరిసిల్ల మానేరు తీరంలోని రాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌, అన్నపూర్ణ, అనంతగిరి ప్రాజెక్ట్‌లు కీలకంగా మారాయి. ఈ ప్రాజెక్ట్‌ల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని 2021 జూలై 4న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనంతగిరి పోచమ్మను దర్శించుకుంటానని అన్నపూర్ణ అనంతగిరి, శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లను పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. వేములవాడ అధ్యాత్మికతకు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పర్యాటకం కూడా స్వాగతం పలుకుతుందని భావించినా ఆచరణలోకి మాత్రం రాలేదు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు రెండు ప్రాజెక్ట్‌ల వద్ద పర్యాటక పరిశీలనలు జరిగాయి. మిడ్‌ మానేరు వద్ద కోడుముంజ గుట్టలకు కలుపుకోని రోప్‌వేలు కాటేజ్‌ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అదేక్రమంలో మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌ సిరిసిల్ల కరకట్ట వద్ద బోటును కూడా సిద్ధం చేసిన కొవిడ్‌తో ప్రారంభానికి నోచుకోలేదు. శాసనసభ ఎన్నికల క్రమంలో గత సంవత్సరం అగష్టు 18న హడావుడిగా నామమాత్రంగా ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. సిరిసిల్లకు రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మిడ్‌ మానేరులోని అందాలను చూసే విధంగా విహరించే అవకాశం అందుబాటులోకి వస్తుందని అనుకున్నా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో ఇప్పట్లో పర్యాటకంపై జిల్లా ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు.

ఫ ఐలాండ్‌ అభివృద్ధికి మోక్షం కలిగేనా?

ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద గుట్టలను అనుసంధానం చేస్తూ అన్నపూర్ణ, అనంతగిరి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇక్కడే అసియాలోనే అతిపెద్ద సర్జిపూల్‌ బావిని కూడా నిర్మించారు. ప్రాజెక్ట్‌లో మధ్యలో ఉన్న 40 ఎకరాలతో ఉన్న గుట్టను ఐలాండ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినా ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాజెక్ట్‌ వద్ద సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్ధిపేట జిల్లాల ప్రజలకు ఎంతో ఇష్టమైన పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకులు, యాత్రికులకు ప్రాజెక్ట్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ప్రతీయేడు లక్షల సంఖ్యలో వచ్చి పోతుంటారు. మిడ్‌ మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గత ప్రభుత్వం భావించింది. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ వద్ద బోటింగ్‌తో పాటు అడ్వేంచర్‌ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్రభుత్వంలో పర్యాటక అభివృద్ధికి బాటలు వేయాలని ఈ ప్రాంతావాసులు కోరుకుంటున్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:42 AM