Share News

మెగా డీఎస్సీ వచ్చేసింది

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:19 AM

ఆరేళ్లకు పైగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఉత్తీర్ణులై కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొత్త ప్రభుత్వం ఊరటను ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌తో టెట్‌ అర్హత అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

మెగా డీఎస్సీ వచ్చేసింది
రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

- ఉపాధ్యాయ కొలువులపై ఆశలు

- జిల్లాలో 151 పోస్టుల భర్తీకి అవకాశం

- ఆరేళ్లకు పైగా టెట్‌ అర్హత అభ్యర్థుల నిరీక్షణ

- జిల్లాలో 10 వేల మంది అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆరేళ్లకు పైగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఉత్తీర్ణులై కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొత్త ప్రభుత్వం ఊరటను ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌తో టెట్‌ అర్హత అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పది వేల మందికి పైగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు మెగా డీఎస్సీకి సిద్ధం కావడానికి సన్నద్ధమయ్యారు. 2015లో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్‌ నిర్వహించారు. 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. ఆ తరువాత దాదాపు ఆరేళ్లు దాటిపోయిన ఉపాధ్యాయ నియామకాలకు సంబందించి గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. గత సంవత్సరం ఎన్నికల సమయంలో సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇదే సమయంలో సెప్టెంబరు 16న మరోసారి టెట్‌ అర్హత పరీక్ష నిర్వహించింది. టెట్‌కు రెండు పరీక్షలకు 5,525 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2022 జూన్‌ 12న నిర్వహించిన పరీక్షల్లో కూడా 12 వేల 781 మంది హాజరవగా 80 శాతం వరకు అర్హత సాధించారు. టెట్‌ స్కోరు సాధించిన వారు ఏడేళ్ల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి రెండుసార్లు టెట్‌ నిర్వహించాల్సి ఉండగా గత సంవత్సరం టెట్‌ నిర్వహించినా ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినా నియామకాలు జరగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్త్తు రుసుము రూ వెయ్యి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 నగరాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో డీఎస్సీకి అప్లయ్‌ చేసుకున్నా వారు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదని ప్రభుత్వం పేర్కొనడం గత అభ్యర్థులకు కొంత ఊరటనిచ్చింది.

అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులే..

గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రంలో రెండు మల్టీజోన్‌లు ఏర్పాటు చేయగా మొదటి మల్టీజోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న జోన్‌లు ఉన్నాయి. రాజన్న జోన్‌లో కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. 2022 సంవత్సరంలో ఉద్యోగ ఖాళీల్లో రాజన్న జోన్‌లో 2,403 ఉద్యోగ ఖాళీలు చూపించగా సిరిసిల్ల జిల్లాలో 601 పోస్టులు ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులే ఉన్నాయి. గురువారం కొత్త ప్రభుత్వం తాజాగా 11,062 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌లు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్‌జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్‌ 220, ఎస్‌జీటీలు 796 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో రాజన్నసిరిసిల్ల జిల్లాలో 151 పోస్టులు ఉన్నాయి. జిల్లాలో 534 పాఠశాలలు ఉండగా 2,352 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 1,979 మంది పనిచేస్తున్నారు. 373 పోస్టులు ఖాళీలు ఉండగా బదిలీలు, పదోన్నతులు, సర్ధుబాటు పోను గత ప్రభుత్వం 103 ఖాళీలను చూపుతూ డీఎస్సీ ద్వారా భర్తీకి సిద్ధమయ్యింది. ప్రస్తుతం పోస్టులను పెంచుతూ తాజగా వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు 56, లాంగ్వేజ్‌ పండిట్‌లు 12 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు నాలుగు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 67, స్పెషల్‌ గ్రేడ్‌లో స్కూల్‌ అసిస్టెంట్లు మూడు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు తొమ్మిది మంది కలిపి నియామకాలు జరగనున్నాయి.

పుస్తకాలతో మళ్లీ కుస్తీ

ఉపాధ్యాయుల కొలువుల కోసం నిరీక్షిస్తున్న డీఎస్సీ అర్హులు నోటిఫికేషన్‌ ముందు నుంచే పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో వందలాది మంది నిరుద్యోగులు డీఎస్సీతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. మరికొందరు కోచింగ్‌ కోసం హైదరాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాలకు కూడా వెళుతున్నారు. దాదాపు అరున్నరేళ్లుగా బీఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, లాంగ్వేజ్‌ పండితులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ నోటిఫికేషన్‌ వెలువడడంతో మళ్లీ ఉపాధ్యాయ కొలువులపై ఆశలు మొదలయ్యాయి.

Updated Date - Mar 01 , 2024 | 12:19 AM