Share News

పంటలు ఎండిపోకుండా చర్యలు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:59 AM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటి పారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26.984 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లిలో 8.564 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు

పంటలు ఎండిపోకుండా చర్యలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటి పారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26.984 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లిలో 8.564 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎక్కడా అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు నీటి పారుదల శాఖాఽధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు తాగునీటికి, మిషన్‌ భగీరథ పథకం ద్వారా రామగుండం, పెద్దపల్లి, మంథని, ధర్మపురి, మంచిర్యాల నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా పరిధిలోని లక్షెట్టిపేట ప్రాంతంలోని 30 వేల ఎకరాలకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తున్నారు. మంథని ప్రాంతంలో 20 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, నీటి కొరత వల్ల మొదటి విడత నీటిని విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం నీటిని ఇవ్వడంలేదు. ఎల్లంపల్లి నుంచి గుండారం రిజర్వాయర్‌కు తరలించి సాగు నీటిని అందిస్తారు. కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం, మంథని ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ఆయకట్టు కలిపి మొత్తం 45,095 ఎకరాల భూములకు సాగునీటిని ఎస్సారెస్పీ ద్వారా ఇస్తున్నారు. ఎస్సారెస్పీ నీటిని వారబందీ ద్వారా విడుదల చేస్తున్నారు. మంథని, రామగుండం ప్రాంతానికి డి-83 ద్వారా, పెద్దపల్లి ప్రాంతానికి డి-86 కాలువ ద్వారా సాగు నీటిని అందిస్తున్నారు.

ఫ కలెక్టర్‌ పరిశీలన..

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 1,88,949 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్సారెస్పీ కింద లక్షా 62 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. డి-86 ద్వారా పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లోని 79,360 ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్‌ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు కొంత మేరకు నీళ్లు అందడం లేదు. ముత్తారం మండలంలోని కాలువ చివరి భూములకు నీరందకపోవడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డి-83 కాలువకు మూడు, నాలుగు రోజుల పాటు అదనంగా నీటిని విడదుల చేయాలని ఆదేశించడంతో డి-86 కాలువకు నీటిని బంద్‌ చేసి వచ్చిన నీటిని ఒకటే కాలువకు సరఫరా చేస్తున్నారు. డి-86 కాలువకు నీటిని నిలిపివేయడంపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డి-83కి మూడు రోజులు నీళ్లు ఇవ్వడంలో జాప్యం జరిగిందని సర్ది చెప్పారని సమాచారం. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మంథని ప్రాంతానికి సాగు నీటిని అందించే విషయమై స్వయంగా పరిశీలిస్తున్నారు. గుండారం రిజర్వాయర్‌తో పాటు ఆ పరిసరాల్లోని చెరువులను పూర్తిగా నింపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న పంటలకు ఢోకా ఉండదని ఈ విషయమై రైతులు ఆందోళన చెందవద్దని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి మార్చి నెలాఖరు వరకు ఇంకా రెండు తడులు, ఏప్రిల్‌ నెలలో పరిస్థితిని బట్టి ఒకటి, రెండు తడుల నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 26.984 టీఎంసీల నీళ్లు ఉండగా, ఒక్కో తడికి 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. మూడు తడులకు నీళ్లు ఇచ్చినా 10.5 టీఎంసీలు, నాలుగు తడులైతే 14 టీఎంసీల నీళ్లు సరిపోతాయని అధికారులు అంటున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నీటిని కేవలం తాగు నీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. సాగు నీటి విషయమై రైతులు ఆందోళన చెందవద్దని అధికార పార్టీకి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ చెబుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:59 AM