Share News

కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:57 AM

కాంగ్రెస్‌లోకి వలసలు ఊపందకున్నాయి. రోజుకో నాయకుడు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తుతుండగా బీఆర్‌ఎస్‌ ఢీలా పడుతున్నది. గత ఎన్నికల ముందు ఒకరిద్దరు నాయకులు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో చేరినా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీలోకి రావలసిందిగా వివిధ పార్టీల వారిని ఆహ్వానించడంతో వలసలు ప్రారంభమయ్యాయి.

కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

- నిన్న ‘ఆరెపల్లి’, నేడు ‘కోడూరి’

- త్వరలో పలువురు కార్పొరేటర్లు చేరే అవకాశం

- ఇద్దరు శాసనసభ్యుల చేరికపై చర్చ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌లోకి వలసలు ఊపందకున్నాయి. రోజుకో నాయకుడు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తుతుండగా బీఆర్‌ఎస్‌ ఢీలా పడుతున్నది. గత ఎన్నికల ముందు ఒకరిద్దరు నాయకులు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో చేరినా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీలోకి రావలసిందిగా వివిధ పార్టీల వారిని ఆహ్వానించడంతో వలసలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మానకొండూర్‌ మాజీ శాసనసభ్యుడు, బీజేపీ నాయకుడు ఆరెపల్లి మోహన్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం తీసుకోగా శనివారం మరో సీనియర్‌ నాయకుడు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన చొప్పదండి మాజీ శాసనసభ్యుడు కోడూరి సత్యనారాయణగౌడ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రస్‌లో చేరారు. ఆ తర్వాత కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు. బీజేపీకి చెందిన మరో మాజీ శాసనసభ్యుడు కటకం మృత్యుంజయం కూడా ఎన్నికల సందర్భంగానే బీజెపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరారు. చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్‌ హస్తం గూటికి చేరగా, ఇటీవల కొత్తపల్లి, కరీంనగర్‌ జడ్పీటీసీలు పిట్టల వినోద రవీందర్‌, పురమల్ల లలిత శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి వారి భర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కరీంనగర్‌ పట్టణానికి చెందిన పలువురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆ పార్టీ జిల్లా నాయకుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ కోసం వారు ఎదురు చూస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే అన్ని పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడంతో త్వరలోనే దాదాపు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశమున్నది. జిల్లాలోని ఇద్దరు సిట్టింగ్‌ శాసనసభ్యులు కాంగ్రెస్‌లో చేరుతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో పార్లమెంట్‌ ఎన్నికలు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు ఆయా పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు కూడా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత వివిధ పార్టీలోకి చేరిన సీనియర్‌ ద్వితీయశ్రేణి నాయకులు, గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకులు కూడా తిరిగి స్వంత గూటికి చేరాలని ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీచేసే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఆ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతారని చెబుతున్నారు.

Updated Date - Mar 31 , 2024 | 12:58 AM