Share News

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

ABN , Publish Date - May 20 , 2024 | 01:05 AM

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించింది.

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

కరీంనగర్‌ టౌన్‌, మే 19: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు..మన బడి కార్యక్రమంలో ఎంపిక చేయని పాఠశాలలను ఈ పథకంలో చేర్చి మౌలిక సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. పాఠశాలల అభివృద్ధి పనులను మహిళా సంఘాలకు అప్పగించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీవోకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు స్వశక్తి మహిళా సంఘాల్లోని క్రియాశీల సభ్యులను విలేజ్‌ ఆర్గనైజర్లుగా ఎంపిక చేయాలని సూచించింది. ఇప్పటికే మహిళా సంఘాల నుంచి విలేజ్‌ ఆర్గనైజర్లను ఎంపిక చేశారు.

మొదటి విడతలో 25 శాతం నిధుల విడుదల

జిల్లాలోని 348 పాఠశాలలను అమ్మ ఆదర్శ స్కూల్స్‌కు ఎంపిక చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారుల అంచనా మేరకు 14.17 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో ఇటీవలనే పనులు ప్రారంభించేందుకు 25శాతం నిధులు 3.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో పాఠశాల భవనాల మరమ్మతులు, విద్యుదీకరణ పనులు, మంచినీటి సౌకర్యం, కొత్తగా మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు పాఠశాల భవనానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విలేజ్‌ ఆర్గనైజర్‌ పేరుతో బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి నిధులను వాటిలో జమ చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులను చురుగ్గా చేపడుతున్నారు. పంచాయతీరాజ్‌, పబ్లిక్‌ హెల్త్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ పనులన్నిటిని పాఠశాలల పునఃప్రారంభం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్‌ 11 వరకు వేసవి సెలవులుండడంతో ఆలోగా పనులు పూర్తయ్యే విధంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ పమేలాసత్పతి, డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికను తెప్పించుకోవడంతోపాటు పాఠశాలలను సందర్శించి అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌పై చర్చిస్తారని చెబుతున్నారు. పేద, సామాన్య కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టిసారించడం అభినందనీయమని విద్యావంతులు, విద్యాభిమానులు, మేధావులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, స్కావెంజర్‌లను తిరిగి పాఠశాలల్లో నియమించాలని, నిధుల కేటాయింపులను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 01:05 AM