Share News

పాల సరఫరాలో మాయాజాలం

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:44 AM

జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలకు పాల సరఫరా చేసే టెండర్లలో మాయాజాలం జరిగింది. పాల సరఫరా దారుడు టెండర్‌లో కోట్‌ చేసిన ధరకే అధికారులు గుడ్డిగా టెండర్‌ ఖరారు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాల సరఫరాలో మాయాజాలం

- ఎమ్మార్పీకి మించి అదనంగా చెల్లిస్తున్న వైనం

- విజయ డెయిరీ లీటర్‌ పాల ధర రూ. 58, చెల్లించేది రూ. 60

- ఎస్‌డబ్ల్యూ గురుకుల పాఠశాలల గుడ్డిగా టెండర్‌ ఖరారు

- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలకు పాల సరఫరా చేసే టెండర్లలో మాయాజాలం జరిగింది. పాల సరఫరా దారుడు టెండర్‌లో కోట్‌ చేసిన ధరకే అధికారులు గుడ్డిగా టెండర్‌ ఖరారు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో వాస్తవ ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోకుండానే టెండర్‌ ఖరారు చేశారు. దీని పర్యావసానంగా ఏడాదికి ప్రభుత్వానికి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు మల్లాపూర్‌, గర్రెపల్లి, మంథని, రామగుండం, నందిమేడారం, పెద్దపల్లిలో ఉన్నాయి. వీటిల్లో 500 నుంచి 700 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాలు, అల్పాహారాలు, పాలు ఇచ్చేందుకు గాను వేర్వేరుగా టెండర్లు నిర్వహిస్తుంటారు. కిరాణ సరుకులు, కోడిగుడ్లు, పాలు నెయ్యి, కూరగాయలు, వంట చెరుకు లేదా వంట గ్యాస్‌ తదితర సరుకుల కోసం ప్రతి ఏటా పాఠశాలలు ఆరంభం అయ్యే సమయంలో జూన్‌, జూలై నెలలో వేర్వేరుగా టెండర్లు ఆహ్వానిస్తారు. టెండర్ల నిర్వహణకు జిల్లాస్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. టెండర్లు దక్కించుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్లు మార్కెట్‌ ధరలను బట్టి ధరలను కోట్‌ చేస్తారు. వచ్చిన టెండర్లను కాంట్రాక్టర్ల సమక్షంలోనే ఓపెన్‌ చేసి నెగోషియేట్‌ చేసి ఖరారు చేస్తారు. పాల టెండర్లకు సంబంధించి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు గానీ, లీటర్‌ పాలను ఎమ్మార్పీకి మించి రెండు రూపాయలు ఎక్కువగా ఖరారు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ప్రొసీడింగ్‌ ఆర్‌సీ నంబర్‌, డీసీఓ/5/మిల్క్‌/2023-24, తేదీ: 14-7-2023 రోజున సంబంధిత గురుకుల పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు.

- జిల్లాలోని ఆరు గురుకులాల్లో..

జిల్లాలోని ఆరు గురుకుల విద్యాలయాల్లో విజయ డెయిరీ పాలను వినియోగించాలని, మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన వీవా విజయ మిల్క్‌ ఏజెన్సీ వాళ్లు లీటర్‌ పాలు (టోన్డ్‌ మిల్క్‌) 60 రూపాయలకు, లీటర్‌ నెయ్యి 630 రూపాయలకు సరఫరా చేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్‌లో అర లీటర్‌ ప్యాక్‌ గల పాల ధర 29 రూపాయలు ఉంది. అంటే లీటర్‌కు 58 రూపాయలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి టెండర్‌ ద్వారా వచ్చే సరుకులు ఓపెన్‌ మార్కెట్‌లో లభించే ధర కంటే రూపాయి తక్కువగానే కోట్‌ చేస్తూ ఉంటారు. బయట మార్కెట్‌లోనే లీటర్‌ పాలు 58 రూపాయలకు లభిస్తుంటే, అధికారులు లీటర్‌ పాలకు 60 రూపాయల ధర నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. ఒక్కో గురుకుల పాఠశాలలో 80 నుంచి 100 లీటర్ల వరకు పాలను మెనూ ప్రకారం వినియోగిస్తూ ఉంటారు. నెలకు 2,400 నుంచి 3,000 లీటర్లు అవసరం ఉంటాయి. ఏడాదిలో సెలవులు పోనూ 10 నెలల పాటు గురుకులాలు నడిచి ఉంటే 24 వేల నుంచి 30 వేల లీటర్ల వరకు పాలను వినియోగిస్తున్నారు. పాలకు ఎమ్మార్పీకి మించి అదనంగా రెండు రూపాయలు చెల్లిస్తున్నారు. 48 వేల నుంచి 60 వేల రూపాయల వరకు ఒక గురుకుల విద్యాలయం పేరిట కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు. ఆరు గురుకులాలకు కలిపి ఏడాదికి 2,88,000 నుంచి 3,60,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్‌ టెండర్‌లో ఎమ్మార్పీ కంటే ఒకటి, రెండు రూపాయలు తక్కువ కోట్‌ చేస్తే ప్రభుత్వంపై రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆదా అయ్యేది. ఒక్క పాల మీదనే ప్రభుత్వం ఏడాదికి ఏడు లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాల టెండర్లను సంబంధిత అధికారులు కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన ధరలను మార్కెట్‌ ధరలకు సరిచూసిన తర్వాత ఖరారు చేశారా, అవేమి పట్టించుకోకుండానే ఖరారు చేశారా అనే విషయం తెలియడం లేదు. ఇప్పటికే ఆరు మాసాలు గడిచింది. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి పాల టెండర్లను పునః సమీక్షించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Jan 28 , 2024 | 12:45 AM