Share News

జోరుగా మట్టి దందా..

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:36 AM

జిల్లాలోని పలు చెరువుల్లో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతున్నది.

జోరుగా మట్టి దందా..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని పలు చెరువుల్లో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతున్నది. మట్టి మాఫియా ఈ ఏడాది రూట్‌ మార్చి మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని చెరువులపై పడింది. రాజకీయ అండదండలతో చెరువులను దక్కించుకున్న ఇటుక బట్టీల యజమానులు అనుమతులకు మించి మట్టి తీసి చెరువులను కొల్లగొడుతున్నారు. ఎక్కడికక్కడే సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి వే బిల్లులు లేకుండా చెరువుల నుంచి నేరుగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని మచ్చిక చేసుకుంటూ ఇటుక బట్టీల యజమానులు తమ వ్యాపారాన్ని, మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపించుకుంటున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా పెద్దఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.

జిల్లాలో 160కి పైగా ఇటుక బట్టీలు..

జిల్లాలోని పెద్దపల్లి, రాఘవాపూర్‌, రంగంపల్లి, రామగిరి, కమాన్‌పూర్‌, రామగుండం, ధర్మారం, సుల్తానాబాద్‌, కాట్నపల్లి, తదితర ప్రాంతాల్లో 160కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ బట్టీల ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, మంచిర్యాల, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరా అవుతూ ఉంటుంది. ఇటుక తయారీకి అవసరమయ్యే చెరువుల్లో లభించే నల్ల రేగడి మట్టిని ప్రతి ఏటా వేసవి కాలంలో రాజకీయ పార్టీల అండదండలతో తరలించుకు పోతున్నారు. ఇటుక బట్టీల యజమానుల పేరిట గానీ, ఇతరుల పేరిట గాని అనుమతులు తీసుకుని కొంత మొత్తంలో రాయల్టీ, సీనరేజీ చెల్లించి పెద్ద ఎత్తున మట్టిని తరలించుకు పోతున్నారు. ఇటుక బట్టీల యజమానులు కొందరు తమకు అవసరమయ్యే మట్టిని తీసుకోవడంతో పాటు ఇతరులకు మట్టిని అమ్ముకుని లక్షలాధి రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రతిసారి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో గల చెరువుల నుంచే ఎక్కువగా మట్టి తీసుక వెళతారు. ఎందుకంటే రవాణా భారం తగ్గుతుంది. ఈ ఏడాది కూడా ఇక్కడి చెరువుల్లో మట్టి తీసేందుకు పలువురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఎవరికి కూడా అనుమతులు ఇవ్వవద్దని నిలురించారు. దీంతో గౌరెడ్డిపేటకు చెందిన ఎన్‌బీసీ ఇటుక బట్టీల యజమాని కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి చెరువులో మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నాడు. మొదట 6 వేలు, ఆ తర్వాత 2 వేల టన్నుల మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాడు. కానీ రాత్రింభవళ్లు అనేక లారీల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా 15 వేల టన్నులకు పైగా మట్టిని తరలించారు. అలాగే రామగుండం మండలం అల్లూరు చెరువు మట్టిని తరలించుకునేందుకు మియాపూర్‌కు చెందిన ఒకరు అనుమతులు తీసుకుని 2 నుంచి 4 వేల టన్నులకు రాయల్టీ చెల్లించి అడ్డగోలుగా మట్టిని తరలించారు. ఈ రెండు చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు పట్టించినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. మంథని మండలంలోని బిట్టుపల్లి చెరువులో మట్టి తవ్వకాల కోసం అనుమతులు పొందగా, గ్రామస్తుల ఫిర్యాదుతో అనుమతులను రద్దు చేశారు. ఆ తర్వాత వారం రోజులకు మళ్లీ అనుమతులు ఇచ్చారు. 10 వేల టన్నుల మట్టి కోసం రాయల్టీ చెల్లించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ముర్మూరు చెరువుపై కన్ను..

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు అడుగంటడంతో ముంపునకు గురైన ముర్మూరు గ్రామంతో పాటు చెరువు తేలింది. దీంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. అనుకున్నదే తడవుగా 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి కోసం పెద్దపల్లి మండలంలోగల ఏఎస్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ సౌందర్య పేరిట అనుమతులు పొందారు. విడతల వారీగా ఏఎస్‌ఆర్‌ 14,500, ఎస్‌హెచ్‌ఆర్‌ 15,500 మెట్రిక్‌ టన్నుల మట్టికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారు. ఈ చెరువులో పది భారీ ఎక్స్‌కవేటర్లు, ప్రొక్లెయిన్లు, 50కి పైగా లారీలను పెట్టి చెరువు నుంచి ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నులకు పైగా మట్టిని చెరువుకు సమీపంలోగల ప్రభుత్వ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. ఆ మట్టి పరిమాణం తెలియకుండా ఉండేందుకు పది వరకు బ్లేడ్‌ ట్రాక్టర్లు పెట్టి నేర్పించి తొక్కిస్తున్నారు. ఎవరన్న అధికారులు వచ్చిన ఆ డంప్‌ను తనిఖీ చేసినా కూడా కొలతలకు దొరకుండా ఉండేందుకు మట్టిని నేర్పుతున్నారు. మట్టి తవ్వకాలపై సంబంధిత నీటి పారుదల శాఖాధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. వాస్తవానికి నీటి పారుదల శాఖాధికారులు ఆయా చెరువుల్లో ఎంత లోతు పరిమాణంలో మట్టి తీసుకోవాలో పరిశీలించి అనుమతి ఇవ్వాలి. గనులు, భూగర్భ శాఖకు రాయల్టీ చెల్లించిన తర్వాత వే బిల్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి మొత్తం బాధ్యతను కేవలం నీటి పారుదల శాఖకు మాత్రమే అప్పగించారు. దీంతో సదరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెళుతున్నా కూడా రవాణా శాఖాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నారు. ఆయా గ్రామాల ప్రజలు మట్టి లారీలను పట్టుకుని అధికారులకు అప్పగించినా కూడా కేసులు నమోదు చేయడం లేదు. పెద్దపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో అక్రమంగా కొందరు ఇటుక బట్టీల యజమానులు తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై కలెక్టర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత నీటి పారుదల శాఖాధికారులను పలుసార్లు వివరణ కోరగా స్పందించడం లేదు.

Updated Date - Jun 09 , 2024 | 12:36 AM