Share News

ప్రోత్సాహం కరువు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:43 AM

ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందకపోవడం... కూలీల ఎక్కువగా అవసరం కావడం.. సరైన మార్కెట్‌ సదుపాయాలు లేకపోవడంతో రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపటం లేదు.

ప్రోత్సాహం కరువు

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందకపోవడం... కూలీల ఎక్కువగా అవసరం కావడం.. సరైన మార్కెట్‌ సదుపాయాలు లేకపోవడంతో రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపటం లేదు. దీంతో ప్రతీ సంవత్సరం జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒకప్పుడు కూరగాయల సాగుకు కేరాఫ్‌గా ఉన్న మండలాలు సైతం ప్రస్తుతం వరి, వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాయి. కేవలం ఇంటి వరకు మాత్రమే రైతులు కూరగాయలను పండిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను కూరగాయాల పంటల సాగువైపు మళ్లిస్తేనే మేలు జరిగే అవకాశాలున్నాయి.

గత యేడాది 75 ఎకరాలు...ప్రస్తుతం...

జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 ఎకరాల్లో వివిధ కూరగాయల సాగు చేస్తున్నారు. గత యేడాది జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు సుమారు 5,600 ఎకరాలు ఉండగా ప్రస్తుతం సాగు పడిపోయింది. యేడాదిలో యాసంగి, వానాకాలం, అదనపు పంట ఇలా మూడు సీజన్‌లలో కూరగాయాల సాగు చేస్తుంటారు. కూరగాయల సాగుకు కూలీల అవసరం ఎక్కువగా ఉండడం, పండించిన పంటను విక్రయించడానికి సరైన మార్కెటింగ్‌ లేకపోవడం, ప్రతీరోజు కూలీలతో పనులు చేయించాల్సి రావడం తదితర కారణాల వల్ల రైతులు కూరగాయల సాగును ఎంచుకోవడం లేదు. ఆకుకూరలు చిన్నపాటి వర్షానికి మురిగిపోవడం వంటి పరిస్థితులు సైతం కారణమవుతున్నాయి. ప్రతీ ఏడాది కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. గతంలో పలు మండలాల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో కూరగాయల సాగు అధికంగా ఉండేది. ఇంటికి సమీపంలోని ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో కూరగాయలను సాగుచేసేవారు. ఇప్పుడు అలాంటిది కేవలం తమ అవసరాలకు మాత్రమే కూరగాయలను సాగు చేస్తున్నారు.

వరి, వాణిజ్య పంటల వైపు మొగ్గు..

జిల్లా రైతులు క్రమంగా కూరగాయల సాగును తగ్గించి... వరి పంట, వాణిజ్య పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. వరి పంట పండించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, సమృద్ధిగా నీరు లభిస్తుండడంతో వరి పంటను ఎక్కువగా పండిస్తున్నారు. దీనికి కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు అందడం లేదు. గతంలో కూరగాయల విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రభుత్వం పత్తి, మిర్చి, వరి విత్తనాలతో పాటు మరికొన్ని వాణిజ్య పంటలకు రాయితీలు ఇస్తున్నారు. కూరగాయ లు పండించే రైతులను ప్రోత్సహించకపోవడంతో ఈ పంటలను సాగుచేసేందుకు రైతులు అనాసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఇంటి వెనక ఉంటే అర ఎకరం విస్తీర్ణంలో కూడా మొక్కజొన్న సాగు చేయడమో నీటి సదుపాయం ఉంటే వరిని సాగు చేయడమో చేస్తున్నారు.

భగ్గుమంటున్న ధరలు...

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ ప్రాంతాలతో వివిధ గ్రామాలకు ఇతర జిల్లాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో సాధారణంగానే ధరలు విపరీతంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట కిలో 80 రూపాయలు, వంకాయ కిలో 80, బెండకాయ కిలో 60, పచ్చిమిర్చి కిలో 80, కాకరకాయ 80, బీరకాయ కిలో 80, క్యాప్సికం కిలో రూ. 80, దొండకాయ కిలో రూ. 80 పలుకుతున్నాయి. సాధారణ ప్రజానికానికి ఈ దరలు చుక్కలను చూపిస్తున్నాయి.

అమ్ముకోవాలంటే ఇబ్బందులే...

రైతులు తాము పండించి కూరగాయలను అమ్ముకోవాలంటే పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సరైన మార్కెట్‌ సదుపాయాలు లేకపోవడంతో కూరగాయల సాగువైపు రైతులు మొగ్గుచూపించడం లేదు. పండించిన ఉత్పత్తులను నిజామాబాద్‌, హైద్రాబాద్‌ తదితర మార్కెట్లకు తీసుకెళ్లాల్సి వస్తోంది. మార్కెట్లు దూరంగా ఉండటంతో ఇక్కడ నుంచి అంతదూరం తీసుకెళ్లడం వ్యయప్రయాసాలతో కూడుకుంటుంది. తీరా తీసుకెళ్లే సమయానికి ఆలస్యం అవ్వడంతో గిట్టు బాటు ధర రావడం లేదు.

సాగు పెంచేందుకు కృషి...

- ప్రతాప్‌సింగ్‌, జిల్లా ఉద్యనవన శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో రైతులు వరి, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయల సాగులో కొంతద వెనుకబడి ఉన్నాం. రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేస్తున్నాం. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రైతులు కూరగాయలు సాగుచేస్తే లాభాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 12:43 AM