Share News

కాంగ్రెస్‌లోకి కార్మిక నేతలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:41 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు సింగరేణి దాకా వచ్చాయి. సింగరేణి కార్మికోద్యమంలో మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రముఖ నాయకులుగా, సంఘాలను నడిపిన చరిత్ర కలిగిన ఆ ఇద్దరు అధికార పార్టీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్‌లోకి కార్మిక నేతలు

గోదావరిఖని, మార్చి 26: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు సింగరేణి దాకా వచ్చాయి. సింగరేణి కార్మికోద్యమంలో మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రముఖ నాయకులుగా, సంఘాలను నడిపిన చరిత్ర కలిగిన ఆ ఇద్దరు అధికార పార్టీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఈ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇందులో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే మల్లయ్యలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెంటనే వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ నాయకుల చేరికలకు తలుపులు తెరవలేదు. ఇప్పుడు చేరికల ప్రక్రియ ముమ్మరం కావడంతో వెంకట్రావ్‌ చేరిక కూడా ఖాయమైనట్టు తెలిసింది. సింగరేణి ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కోల్‌బెల్ట్‌ ప్రాంత పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీకి సమీకరణల అవసరం ఉన్నది. ఈ సందర్భంలో వెంకట్రావ్‌ చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కాంగ్రెస్‌లోనే పుట్టి ఎమ్మెల్సీగా ఎదిగి సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూసీ)కి 30ఏళ్ల పాటు అధ్యక్షునిగా పనిచేసి సంఘాన్ని గుర్తింపులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన వెంకట్రావ్‌ సంజీవరెడ్డి తర్వాత రాష్ట్రంలో ఐఎన్‌టీయూసీకి ఆయనే పెద్ద దిక్కుగా మారారు. 2014లో టీబీజీకేఎస్‌ గుర్తింపులోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఏర్పడింది. అప్పటికి వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ సందర్భంలో అనూహ్యంగా వెంకట్రావ్‌ 2016ఆగస్టులో బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకట్రావ్‌ చేరికకు సామాజికవర్గ నేపథ్యమే ప్రధాన భూమికగా చెప్పుకున్నారు. అప్పుడు టీబీజీకేఎస్‌ అంతర్గత సంక్షోభంలో ఉన్నది. అప్పటివరకు టీబీజీకేఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆకునూరి కనకరాజును తొలగించి బీఆర్‌ఎస్‌లో చేరిన వెంకట్రావ్‌ను తక్షణమే అధ్యక్షుడిగా చేశారు. 2023వరకు సింగరేణిలో టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగానే ఉన్నది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో గుర్తింపు సంఘం ఎన్నికల ముందు వెంకట్రావ్‌ టీబీజీకేఎస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి స్తబ్ధంగా ఉన్న వెంకట్రావ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకట్రావ్‌కు కాంగ్రెస్‌ మాతృ సంస్థే కనుక ఆయన కొత్తగా చానల్‌ పట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. వెంకటస్వామి కుటుంబంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులందరితో సంబంధాలు ఉన్న వెంకట్రావ్‌ చేరిక నామామత్రం కానున్నది. టీబీజీకేఎస్‌కు వెంకట్రావ్‌ చేసిన రాజీనామా నిన్న మొన్నటి వరకు ఆమోదం పొందలేదు. కానీ రెండు రోజుల క్రితం గోదావరిఖనిలో టీబీజీకేఎస్‌ కేంద్ర వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వెంకట్రావ్‌, కే మల్లయ్య రాజీనామాలను ఆమోదించింది.

ఫ ఊహాగానాలకు బలం..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వైపు సింగరేణి కార్మికులను మళ్లించడంలో కే మల్లయ్య కీలక భూమిక పోషించారు. టీబీజీకేఎస్‌ను ఏర్పాటు చేయడంలో ఆయనే ముఖ్యుడు. అప్పటినుంచి టీబీజీకేఎస్‌ గుర్తింపులోకి వచ్చే వరకు పని చేసిన కే మల్లయ్య గుర్తింపులోకి వచ్చిన తరువాత అంతర్గత విభేదాలతో 2014లో టీబీజీకేఎస్‌కు దూరమయ్యారు. ఆ తరువాత బీఎంఎస్‌లోకి వెళ్లారు. బీఎంఎస్‌కు సింగరేణిలో నాయకత్వం వహించారు. కానీ విప్లవ, వామపక్ష ఉద్యమాల నుంచి ఎదిగిన మల్లయ్య బీఎంఎస్‌లో ఇమడలేకపోయారు. కేటీఆర్‌ పిలిచి పార్టీలో, యూనియన్‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మల్లయ్య తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లయ్యకు హోదా కల్పించారు. అయితే కే మల్లయ్య కూడా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గౌరవ అధ్యక్షురాలు కవిత కార్యాచరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే వెంకట్రావ్‌, మల్లయ్య, రాజిరెడ్డి యూనియన్‌ పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి మల్లయ్య టీబీజీకేఎస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. ఈమధ్య గోదావరిఖనిలో జరిగిన టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి కూడా టీబీజీకేఎస్‌ వర్గాలు మల్లయ్యను సాదరంగా ఆహ్వానించాయి. కానీ మల్లయ్య సమావేశానికి దూరంగా ఉండిపోవడంతో ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కే మల్లయ్య రాజీనామాను కూడా ఆమోదించారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌ పార్టీలోకి కే మల్లయ్య వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో పొంగులేటి బీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న సమయంలో టీబీజీకేఎస్‌ వ్యవహారాలను కూడా ఖమ్మం ప్రాంతంలో చక్కబెట్టారు. అప్పటినుంచి శ్రీనివాస్‌రెడ్డితో మల్లయ్యకు దగ్గరి సంబంధాలున్నాయి. ఇంతకాలం వేచి చూసిన ఈ కార్మిక నాయకులు, అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో వీరిని పార్టీలోకి తీసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మల్లయ్య కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే వెంకట్రావ్‌ మాత్రం ఐఎన్‌టీయూసీ నాయకత్వాన్ని తిరిగి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇంతకాలంగా టీబీజీకేఎస్‌కు నాయకత్వం వహిస్తూ ఐఎన్‌టీయూసీకి నష్టం చేసిన వెంకట్రావ్‌ను సదరు యూనియన్‌ వర్గాలు ఆమోదిస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనా పార్లమెంట్‌ ఎన్నికల ముందు సింగరేణిలోని ఈ ప్రముఖ కార్మిక నేతలు కాంగ్రెస్‌లో చేరడం మాత్రం చర్చనీయాంశమే. టీబీజీకేఎస్‌కు సంబంధించిన ఈ నాయకులిద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో సింగరేణి ప్రాంతంలో బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగే పరిణామంగా చెప్పుకోవచ్చు.

Updated Date - Mar 27 , 2024 | 12:41 AM