Share News

కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:08 AM

కొండగట్టు అంజన్న సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అబద్ధాలు చెప్పారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిసభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు.

  కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు
బీజేపీ మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌

ఆరు గ్యారెంటీలు ఎంత మందికి ఇచ్చారు

- కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువు

- బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు గల్లంతు

- 19న మొదటి సెట్‌, 25న మరో సెట్‌ నామినేషన్‌

- ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 11: కొండగట్టు అంజన్న సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అబద్ధాలు చెప్పారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిసభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. గురువారం నగరంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని బీజేపీ మండల ధ్యక్షులు, మండల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎంత మందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఒక్క మహిళకైనా 2500 ఇస్తున్నారా, రైతులకు వరి ధాన్యంపై 500 బోనస్‌, 15 వేల రైతు భరోసా, విద్యార్థులకు 5 లక్షల భరోసాకార్డు, వృద్దులు, వితంతువులకు నాలుగు వేల ఫించన్‌, రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కరీంనగర్‌కు అభివృద్ధి చేసి ఉంటే హుస్నాబాద్‌కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. తాను రోడ్ల విస్తరణ, కరీంనగర్‌ అభివృద్ధికి 12 వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకు వచ్చానన్నారు. అన్ని తానే చేసినట్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందని, కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థే కరువయ్యాడన్నారు. ఈ నెల 19న మొదటి సెట్‌ నామినేషన్‌ నిరాడంబరంగా వేస్తానని, 25న మరో సెట్‌ నామినేషన్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వేల మందితో వేస్తున్నట్లు ప్రకటించారు. సర్వేలన్నింటిలో కరీంనగర్‌లో బీజేపీ గెలుపు ఖాయమని నివేదిక వస్తున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ కొత్త ప్రచారానికి తెరలేపిందని, వాళ్ల అభ్యర్థి మంచోడని, పార్టీ మంచిది కాదని, మూడు లక్షల మెజారిటీతో గెలుస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మంచోడనే ముసుగులో కేసీఆర్‌ కుటుంబానికి దోచిపెట్టడం, ఆయన కుటుంబానికి దోచుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీజేపీని ఓడించడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఏనాడైనా కరీంనగర్‌ ప్రజల కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో ప్రజల పక్షాన బీజేపీ నిలిచిందన్నారు. పోరాటాలు చేస్తే కేసులు, లాఠీల దెబ్బలు తిన్నది బీజేపీ నాయకులు, కార్యకర్తలన్నారు. 150 రోజులు 1,600 కిలోమీటర్లు పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నామన్నారు. బీజేపీ పోరాటాల వల్లే బీఆర్‌ఎస్‌ను ప్రజలు గద్దె దించారన్నారు. అది కలిసి వచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు ప్రజలకు బీజేపీ కట్టబెడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థే దొరకడం లేదని, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి అభ్యర్థిని తీసుకువస్తారా అని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నదని, ఈ అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలంతా వినియోగించుకుని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి అత్యఽధిక మెజారిటీతో బీజేపీ గెలిపించాలన్నారు. సమావేశంలో కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, బొమ్మ శ్రీరాం పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM