జన సంద్రంగా రాజన్న క్షేత్రం
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:56 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సోమవారం అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో జాతరను తలపించింది
- 80 వేల మందికిపైగా భక్తుల రాక
వేములవాడ, ఫిబ్రవరి 5 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సోమవారం అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో జాతరను తలపించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లడానికి ముందు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ఆనవాయితీ ప్రకారం నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు సుమారు 80 వేల మందికిపైగా భక్తులు రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు అంచనా. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన రాజన్న దర్శనం సోమవారం రాత్రి వరకు నిరంతరాయంగా సాగింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి స్వామివారి దర్శనం త్వరితగతిన సాగే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో అభిషేకం, అన్నపూజ నిలిపివేయడంతో క్యూ లైన్లు వేగంగా కదిలాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ నిరీక్షించారు. కోడె మొక్కు క్యూలైన్ పార్కింగ్ స్థలం వరకు సాగడంతో మొక్కు చెల్లింపునకు సుమారు నాలుగు నుంచి ఐదు గంటలకుపైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన కోడె మొక్కు చెల్లింపు సోమవారం రాత్రి వరకు సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ప్రాంగణంతోపాటు ప్రధాన వీధులు, జాత్రా గ్రౌండ్ కిటకిటలాడాయి. భక్తుల వాహనాలతో గుడి చెరువు పార్కింగ్ ప్రదేశం పూర్తిగా నిండిపోయింది. బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. వేలాది మంది భక్తులు తలపై బోనం పెట్టుకొని క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది.