Share News

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి జ్యోతి

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:54 PM

జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి యేడాది క్రితం రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న పదవికి బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకు 39వ వార్డు కౌన్సిలర్‌ సమిండ్ల వాణి పోటీ చేయగా, బీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్‌ అడువాల జ్యోతి పోటీ చేశారు.

 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి జ్యోతి

- కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, ఫార్వర్డ్‌ బ్లాక్‌ మద్దతుతో విజయం

జగిత్యాల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి యేడాది క్రితం రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న పదవికి బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకు 39వ వార్డు కౌన్సిలర్‌ సమిండ్ల వాణి పోటీ చేయగా, బీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్‌ అడువాల జ్యోతి పోటీ చేశారు. ఈ ఎన్నికలో 46 మంది కౌన్సిలర్లతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కును వినియోగించు కున్నారు. బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి అడువాల జ్యోతికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆరుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు, ఏఎంఐఎం, ఆల్‌ ఇండియా ఫార్వడ్డ్‌ బ్లాక్‌కు చెందిన ఒక్కొక్కరు, స్వతంత్ర కౌన్సిలర్లు ఐదుగురు, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తొమ్మిది మంది మద్దతు తెలపడంతో 24 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సమిండ్ల వాణికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు 19 మంది, బీజేపీ, స్వతంత్ర, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు ఒక్కొక్కరు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ మద్దతు పలకడంతో 23 ఓట్లు వచ్చాయి. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించగా ఒక్క ఓటు తేడాతో అడువాల జ్యోతి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా జగిత్యాలలో 48 వార్డులున్నాయి. ఇందులో బీఆర్‌ఎస్‌ 30, కాంగ్రెస్‌ 7, బీజేపీ 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, ఏఐఎంఐఎం 1, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు. మూడేళ్ల క్రితం జరిగిన చైర్‌పర్సన్‌ ఎన్నికలో బీసీ కేటాగిరిలోని పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ 37వ వార్డు కౌన్సిలర్‌ బోగ శ్రావణి ఎన్నికయ్యారు. సుమారు యేడాది క్రితం బోగ శ్రావణి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. యేడాదిగా మున్సిపల్‌ వైస్‌చైర్మ న్‌ గోలి శ్రీనివాస్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు.

ఫ విప్‌ ధిక్కరించిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు..

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా మెజార్టీ కౌన్సిలర్ల స్థానాలను కలిగిన బీఆర్‌ఎస్‌ విప్‌ను జారీ చేసింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు బీఆర్‌ఎస్‌కు చెందిన 39వ వార్డు కౌన్సిలర్‌ సమిండ్ల వాణిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ విప్‌ను జారీ చేశారు. అయితే సంబంధిత విప్‌ను దిక్కరిస్తూ ఎన్నిక సమావేశంలో తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఓటు వేయడంతో రెబల్‌ అభ్యర్థి జ్యోతి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. విప్‌ దిక్కరించిన కౌన్సిలర్ల వ్యవహార తీరుపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ జగిత్యాల బల్దియా రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంది. అయితే సంబంధిత విప్‌ జారీ సమాచారం తమకు అందలేదని పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వాదిస్తున్నారు.

ఫ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసంలో సంబరాలు..

పట్టణంలోని జమ్మి గద్దె సమీపంలో గల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసం వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన బీఆర్‌ఎస్‌ రెబల్‌ అడువాల జ్యోతి సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసానికి అడువాల జ్యోతితో పాటు ఆమె మద్దతు దారులు వెళ్లారు. జగిత్యాల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు శాలువలు, పూలమాలలో అడువాల జ్యోతిని సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ పార్టీలకతీతంగా పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డిలను కలుపుకొని పోతూ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మీ దేవేందర్‌రెడ్డి, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఫ బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా అడువాల జ్యోతి లక్ష్మణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతానని, అందరి సభ్యుల సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వల్లెపు రేణుక మొగిలి, సింగం పద్మ సింగారావు, గుగ్గిల్ల హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:54 PM