జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసంపై ఉత్కంఠ
ABN , Publish Date - Jan 02 , 2024 | 11:36 PM
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావుపై అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చిన నాటి నుంచి జమ్మికుంట రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.
జమ్మికుంట రూరల్, జనవరి2: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావుపై అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చిన నాటి నుంచి జమ్మికుంట రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాల్టీలో ఇరువై మంది సంతకాలతో అవిశ్వాసం తీర్మానం కాపీని గత నెల 29న డీఆర్‌వో పవన్‌కుమార్‌కు ఆందజేశారు. అప్పటి నుంచి క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చైర్మన్‌కు వ్యతిరేకంగా ఇరువై మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్లు తెలుసు కున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రంగంలోకి దిగారు. గత నెల 28రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి తాము రాజేశ్వర్‌రావుకు మద్ధతు పలుకుతున్నట్లు కౌన్సిలర్లతో సంతకాలు చేయించుకున్నారు. చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లను వెంట తీసుకువెళ్లి అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరంచవద్ధని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మాణాన్ని డీఆర్వోకు ఆందజేసిన ఆనంతరం 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య నేతృత్వంలో హైదరాబాద్ క్యాంపునకు తరలివెళ్లారు. ఆనంతరం మరుసటి రోజు చైర్మన్ తన మద్దతు దారులతో కలిసి క్యాంపులో ఉన్న కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లగా కొంత ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో రాజేశ్వర్‌రావు సైతం తన అనచరులతో హైదరాబాద్‌లోని మరోచోట క్యాంపు నిర్వహిస్తున్నారు. పొనగంటి మల్లయ్య కాం్యపులో 16మంది, రాజేశ్వర్‌రావు క్యాంపులో 14మంది ఉన్నట్లు తెలిసింది. ముందుగా పొనగంటి మల్లయ్య వెంట వెళ్లి సంతకాలు చేసిన కౌన్సి లర్లలో కొందరు తిరిగి రాజేశ్వర్‌రావు వెంట వెళ్లి ఆయనకు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మల్లయ్య క్యాంపులో ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్లు క్యాంపును వీడినట్లు సమాచారం. ఎవరి క్యాంపులో ఎంత మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎవరు, ఎవరికి మద్ధతు తెలుపుతారో అనే ఆంశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిలర్లు కాం్యపులో కొనసాగుతుండగా జమ్మికుంట మున్సిపాలిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే చర్చ నడుస్తోంది.