Share News

పల్లెలకు జీవం పోసింది సర్పంచులే

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:38 AM

తెలంగాణ పల్లె ప్రగతికి ప్రాణం పోసింది కేసీఆర్‌ అయితే పల్లెలకు సరికొత్త జీవం పోసింది సర్పంచ్‌లేనని, పల్లెల దశ, దిశ మార్చిన సర్పంచ్‌లకు సలాం చేస్తున్నానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.

పల్లెలకు జీవం పోసింది సర్పంచులే
మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పల్లె ప్రగతికి ప్రాణం పోసింది కేసీఆర్‌ అయితే పల్లెలకు సరికొత్త జీవం పోసింది సర్పంచ్‌లేనని, పల్లెల దశ, దిశ మార్చిన సర్పంచ్‌లకు సలాం చేస్తున్నానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనంలో పదవీ కాలం ముగుస్తున్న నేపఽథ్యంలో సిరిసిల్ల నియోజవర్గ బీఆర్‌ఎస్‌ సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల కుటుంభాలతో కలిసి భోజనం చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ ఉద్యమ నినాదాలే కాదు మహాత్మాగాంధీ కలలను సాకారం చేసింది తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఒకప్పుడు పల్లెలు అంటే పాత గోడలు, పాడుబడిన బావులు, చెత్తకుప్పలు, చెప్పలేనన్ని తిప్పలు ఉండేవని అన్నారు. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ దేశం ముందు కాలర్‌ ఎగరేసుకుని నిలిచిందన్నారు. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెలు, సకల సౌకర్యాల హరివిల్లుగా మార్చిన ఘనత మనదేనన్నారు. ఆదర్శ గ్రామాలకు అవార్డులకు తెలంగాణ పల్లెలు చిరునామాగా నిలిచాయన్నారు. మహాయజ్ఞంలో మనస్సు పెట్టి పనిచేసిన సర్పంచులు పల్లెల దశ, దిశ మార్చినందుకు హ్యాట్సాప్‌ తెలిపారు. గతంలో దేశంలోని ఇతర పార్టీల నాయకులకు తాను సవాల్‌ చేశానని ఏ రాష్ట్రానికైనా వస్తానని తెలంగాణలో ఉన్నట్లు నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, అంతిమ సంస్కారం సంస్కార తవంతంగా జరిగే విధంగా వైకుంఠధామాలు ఎక్కడా ఉన్నాయని అన్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వారా 1858 గిరిజన అవసాసాలు గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, 3146 మంది గిరిజన అదివాసీలను సర్పంచ్‌లుగా ఎన్నుకున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్రం రూ 259 కోట్లు విడుదల చేసిందని అన్నారు. సమైక్య పాలనలో కంపు యార్డులే తప్ప డంపు యార్డులు లేవన్నారు. పల్లె ప్రజల భాగస్వామ్యంతో తీరు మారిన ప్రతీ ఊరు మెరుగైన జీవనానికి మారుపేరుగా ఉందన్నారు.

జిల్లాలో ప్రగతి ఫలాలు ఎన్నో

జిల్లాలో పల్లె ప్రగతి ఫలాలు ఎన్నో ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. పల్లె ప్రగతి ముందు జిల్లాలో నాలుగు గ్రామాలకే ట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు ప్రతీ గ్రామానికి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయని, ఆరు గ్రామాల్లో రెండు చొప్పున ఉన్నాయన్నారు. గతంలో నర్సరీలు, పల్లె పకృతివనాలు, కంపోస్ట్‌ షెడ్‌లు, వైకుంఠధామాలు లేవని ఇప్పుడు ప్రతీ గ్రామానికి ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో పంచాయ తీరాజ్‌ అవార్డులు 9 వచ్చాయని అన్నారు. మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

సిరిసిల్లలో పరామర్శలు. ఆశీర్వాదాలు

సిరిసిల్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు అగ్గిరాములు ఇటీవల గృహ ప్రవేశం చేయగా వారి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. గజభీంకార్‌ బాబు కూతురు, అల్లుళ్లను అశీర్వదించారు. గుండ్లపెల్లి రామానుజం, కుడిక్యాల రవిని పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రూపొందించిన క్యాలెండర్‌ను అవిష్కరించారు.

Updated Date - Jan 17 , 2024 | 12:38 AM