Share News

లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి పెరిగిన ఓటింగ్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:16 AM

ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరన్న తీర్పు వెల్లడైంది. కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును మంగళవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో చేపట్టారు. పోటీచేసిన అభ్యర్థులతోపాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు అభిమానులు ఆసక్తిగా తెలుసుకున్నారు.

లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి పెరిగిన ఓటింగ్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరన్న తీర్పు వెల్లడైంది. కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును మంగళవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో చేపట్టారు. పోటీచేసిన అభ్యర్థులతోపాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు అభిమానులు ఆసక్తిగా తెలుసుకున్నారు. తమ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఓటింగ్‌ జరిగిందనే దానిపై చర్చించుకున్నారు. పార్లమెంట్‌ సీట్లలో ఎవరికి మెజార్టీ వస్తుందని దేశంలో మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జోరందుకుంది. దీంతోపాటు బెట్టింగ్‌లు సాగాయి. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో కమలం వైపే ఓటర్లు మొగ్గు చూపారు. 2019 పార్లమెంట్‌, 2023 శాసనసభ ఎన్నికల కంటే బీజేపీ ఓటు బ్యాంక్‌ను పెంచుకుంది. రెండు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 1,54,273 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు 1,03,953, కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు 69,632 ఓట్లు లభించాయి. ఇందులో సిరిసిల్ల సెగ్మెంట్‌ నుంచి బీజేపీకి 72,559, బీఆర్‌ఎస్‌ 65,811 ఓట్లు, కాంగ్రెస్‌కు 33,610 ఓట్లు లభించాయి. వేములవాడ సెగ్మెంట్‌లో బీజేపీకి 81,714 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 38,142 ఓట్లు, కాంగ్రెస్‌కు 36,022 ఓట్లు వచ్చాయి.

కారుకు బ్రేక్‌.. బీజేపీ జోరు

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటింగ్‌ శాతం తగ్గింది. బీజేపీ ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంది. సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో కారుకు బ్రేక్‌ పడింది. బీఆర్‌ఎస్‌కు శాసనసభ ఎన్నికల్లో రెండు సెగ్మెంట్‌లలో 1,46,114 ఓట్లు లభించాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 1,03,953 ఓట్లు మాత్రమే వచ్చాయి. 42,161 ఓట్లు తగ్గిపోయాయి. సిరిసిల్ల సెగ్మెంట్‌లో శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 89,244 ఓట్లు లభించగా పార్లమెంట్‌ ఎన్నికల్లో 65,811 ఓట్లు వచ్చాయి. 23,433 ఓట్లు తగ్గిపోయాయి. వేములవాడలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 56,870 ఓట్లు లభించగా పార్లమెంట్‌లో 38,142 ఓట్లు వచ్చాయి. 18,728 ఓట్లు తగ్గిపోయాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు సెగ్మెంట్లలో బీజేపీకి 1,37,059 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 1,17,881 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 1,03,953 ఓట్ల, బీజేపీకి 1,54,273 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 17,214 ఓట్లు పెరిగాయి. సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌ 5713 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ సారి బీజేపీ అధిక్యతను సాధించింది. బీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ 6748 ఓట్లను అధిక్యత పెంచుకుంది. వేములవాడ సెగ్మెంట్‌లో కూడా గత పార్లమెంట్‌ ఎన్నికల అనవాయితీనే పెంచుకుంటూ ఈసారి భారీ మెజార్టీని పెంచుకుంది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 47,399 ఓట్లు రాగా బీజేపీకి 72,290 ఓట్లు లభించాయి. 24,891 ఓట్లు మెజార్టీ సాధించగా ఈ సారి రెండితలుగా పెంచుకుంది. బీజేపీ 81,714 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 38,142 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌పై 43,572 ఓట్ల మెజార్టీని సాధించుకోగలిగారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఓటింగ్‌ శాతం పెంచుకోలేక బీఆర్‌ఎస్‌ శ్రేణులు అతలాకుతలమయ్యాయి. బీజేపీ అభ్య ర్థి విజయం సాధించడంతో జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

నోటాకు 1356 ఓట్లు

పార్లమెంట్‌ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో నోటాకు 1356 ఓట్లు లభించాయి. సిరిసిల్ల సెగ్మెంట్‌లో 1,85,573 ఓట్లు పోలవగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు 1,71,980 ఓట్లు, ఇతరులకు 14,323, నోటాకు 730 ఓట్లు భించాయి. వేములవాడ సెగ్మెంట్‌లో ప్రధాన పార్టీలకు 1,55,878 ఓట్లు రాగా ఇతరులకు 11,862 ఓట్లు వచ్చాయి. నోటాకు 626 ఓట్లు లభించాయి.

Updated Date - Jun 05 , 2024 | 12:16 AM