డీఎస్సీలో పెరిగిన పోస్టులు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:28 AM
అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11,062 పోస్టులతో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖాధికారులు, మంత్రులతో కలిసి కొత్త నోటిఫికేషన్‌ను జారీచేశారు.
- గతంలో 43.. ప్రస్తుతం 93 పోస్టులు
- ప్రత్యేక అవసరాలుగల పిల్లల విద్యా బోధనకు కొత్తగా 17 పోస్టులు
- వయోపరిమితి రెండేళ్లు పెంపు.. పెరగనున్న అభ్యర్థుల సంఖ్య
- నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11,062 పోస్టులతో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖాధికారులు, మంత్రులతో కలిసి కొత్త నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను కూడా వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 17న బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జిల్లాలో 43 పోస్టులను చూపగా, ప్రస్తుతం నోటిఫికేషన్‌లో ఆ సంఖ్య 93కు పెరిగింది. స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్జీటీ పోస్టులతో పాటు కొత్తగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 49, భాషా పండితుల పోస్టులు 5, పీఈటీ ఒక పోస్టు, స్పెషల్ గ్రేడ్ టీచర్ పోస్టులు 21, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 5, ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 12 ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా 43 పోస్టులు ప్రకటించగా, ప్రస్తుతం 50 పోస్టులు పెరిగాయి. గతంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఏప్రిల్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు వయసు మరో రెండేళ్లు అదనంగా పెంచారు. ఓసీ అభ్యర్థులకు 46 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 51 ఏళ్లు, దివ్యాంగులకు 56 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. గత ఏడాది జూలై 1వ తేదీ నాటికి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఫ అన్ని జిల్లాల కంటే తక్కువ పోస్టులు..
ప్రభుత్వం జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అన్ని జిల్లాలకంటే పెద్దపల్లి జిల్లాలోనే తక్కువగా 93 పోస్టులు ప్రకటించారు. గత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉండగా, వాటిలో అదనంగా 33 పోస్టులు పెరిగాయి. కొత్తగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబోధన చేసేందుకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 17 ఉన్నాయి. వీటిని మొట్టమొదటిసారిగా నేరుగా భర్తీచేస్తున్నారు. జిల్లాలో 549 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలకు 2494 పోస్టులు మంజూరుకాగా, 2,224 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 270 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎం-2 పోస్టులు 2, స్కూల్ అసిస్టెంట్ గణితం 24, భౌతికశాస్త్రం 6, జీవశాస్త్రం 26, సాంఘిక శాస్త్రం 56, ఇంగ్లీష్ 9, తెలుగు 15, హిందీ 17, ఉర్దూ 2, పీడీ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భాషా పండితులు తెలుగు 3, హిందీ 2, వ్యాయామ ఉపాధ్యాయులు ఒకటి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం 34, ఎస్జీటీలు 29 పోస్టులు, పీఈటీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగతా 30 శాతం నేరుగా భర్తీచేయనున్నారు. ఎస్‌జీటీ, పీఈటీ, భాషా పండిత పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన స్కూల్‌అసిస్టెంట్ పోస్టులు 48, ఎస్జీటీలు 29, భాషా పండితులు 6, ఒక పీఈటీ పోస్టు మొత్తం 84పోస్టులను నోటిఫికేషన్‌లో చేరుస్తారని అభ్యర్థులు భావించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి పెరగా, భాషా పండితులు ఒకటి, ఎస్జీటీ పోస్టులు 8 తగ్గాయి.
ఫ పెరగనున్న అభ్యర్థుల సంఖ్య..
గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు మరికొంత మంది అభ్యర్థులు పెరగనున్నారు. ఇందుకు కారణం దరఖాస్తు చేసుకునే వారి నిర్దిష్ట వయస్సును 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. అంతేగాకుండా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కొత్తగా పోస్టులను ప్రవేశపెట్టారు. దీంతో బీఈడీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేసిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. జిల్లాలో ఆ పోస్టులు 17 ఉండడంతో వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారితో అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనున్నది. పాత నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులకు తోడు మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.