ఎడతెరిపిలేని వాన
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:03 AM
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నేలమ్మ తడిసి ముద్దయ్యింది. సీజన్ ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు నిరాశపర్చినా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరుతోంది. ఒర్రెలు, వాగుల్లో వరదనీరు పారుతోంది.

- మిడ్ మానేరు ప్రాజెక్ట్‌కు గోదావరి జలాలు
- ఎల్లంపల్లి వద్ద మొదలైన ఎత్తిపోతలు
- జిల్లాలో సాధారణ వర్షపాతం 333.6 మిల్లీమీటర్లు
- 414.6 మిల్లీమీటర్ల వర్షం నమోదు
- చెరువులు, కుంటల్లోకి చేరుతున్న వరదనీరు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నేలమ్మ తడిసి ముద్దయ్యింది. సీజన్ ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు నిరాశపర్చినా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరుతోంది. ఒర్రెలు, వాగుల్లో వరదనీరు పారుతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడిన వర్షం పడింది. 5.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 14.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని రుద్రంగిలో 21.2 మిల్లీమీటర్లు, చందుర్తి 18.0, వేములవాడ రూరల్ 15.9, బోయినపల్లి 17.6, వేములవాడ 16.4, సిరిసిల్ల 15.6, కోనరావుపేట 16.2, వీర్నపల్లి 16.2, ఎల్లారెడ్డిపేట 12.0, గంభీరావుపేట 8.4, ముస్తాబాద్ 9.3, తంగళ్లపల్లి 11.7, ఇల్లంతకుంటలో 9.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి 30 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లోకి 20 క్యూసెక్కులు, మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి 293 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలకు ఎంతో ఊరటనిస్తే పంటలు దక్కు తాయని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో శనివారం వరకు 333.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 414.6 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలోని 13 మండలాలు ఉండగా ఎనిమిది మండలాల్లో అధిక వర్షం, ఆరు మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. చందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
మిడ్‌మానేరుకు గోదావరి జలాలు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గుండెకాయగా మారిన జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లో నీళ్లు అడుగంటి వెలవెలబోతున్న క్రమంలో మళ్లీ గోదావరి జలాలతో జలకళను సంతరించు కోనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏర్పడిన లోపాలతో సిరిసిల్ల మిడ్ మానేరులోకి నీటి ఎత్తిపోత నిలిచిపోయింది. ప్రస్తుతం 27.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లో 5.86 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 17.14 టీఎంసీల నీరు ఉంది. కాళేశ్వరం జలాలు ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను తరలిస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తకుండా నంది మేడారం, నంది పంప్‌హౌస్ నుంచి లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరులోకి నీటిని తరలించే ప్రక్రియ మొదలు పెట్టింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి 293 క్యూసెక్కుల వరదనీరు మానేరు, మూల వాగుల నుంచి వచ్చి చేరుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నుంచి ఎల్‌ఎండీ, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లకు నీటిని వదిలే అవకాశం ఉంది. జిల్లాలోని అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 3.50 టీఎంసీలకు 0.75 టీఎంసీల నీరు ఉంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి నీటిని నింపడం ద్వారా బ్యాక్ వాటర్‌తో వేములవాడ, సిరిసిల్ల మానేరు వాగులో దాదాపు 18 కిలోమీటర్ల మేరకు నీటి నిల్వలు చేరి భూగర్భ జలాలు పెరగనున్నాయి.
90,286 ఎకరాల్లో సాగు
వర్షాభావ పరిస్థితులతో ఆలస్యంగా ప్రారంభమైన వానాకాలం సాగు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలకం ఊపందుకుంది. 2.42 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా వేయగా ఇప్పటి వరకు 90 వేల 286 ఎకరాల్లో పంటలు వేశారు. జిల్లాలో వరి, పత్తి సాగు ప్రధాన పంటలుగా ఉన్నాయి. వరి 1.83 లక్షల ఎకరాలకు 41,904 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పత్తి 49,215 ఎకరాలకు 46,493 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఇతర పంటల్లో 877 ఎకరాల మొక్కజొన్న, 823 ఎకరాల్లో కందులు, 46 ఎకరాల్లో పెసర. 143 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు.