Share News

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నాలుగేళ్లు ఆగమవుడే

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:50 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నాలుగేళ్లు ఆగమవ్వాల్సి వస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ రాంనగర్‌లో అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నాలుగేళ్లు ఆగమవుడే

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 12: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నాలుగేళ్లు ఆగమవ్వాల్సి వస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ రాంనగర్‌లో అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. కరీంనగర్‌ రోడ్లు, డ్రైనేజీలతో అద్భుతంగా అభివృద్ధి చెందిందని, నాటి సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ కృషి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌ తోడ్పాటు వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌- మనోహరాబాద్‌ రైల్వేలైనును మంజూరు చేయించారని, 2014లో ఎంపీగా గెలిచిన వినోద్‌కుమార్‌ నిధులు తేవడంతో పనులు వేగంగా జరిగాయన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ సాధించిన ఘనత వినోద్‌కుమార్‌దేనని తెలిపారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ పార్లమెంట్‌లో 106 సార్లు మాట్లాడి జాతీయ రహదారులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరీ చేయించారని, ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఒక్కసారైనా నియోజకవర్గానికి ఇది కావాలని పార్లమెంట్‌లో మాట్లాడారా అని ప్రశ్నించారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమి లేదని, అన్ని వస్తువుల ధరలు పెంచిందని విమర్శించారు. బీజేపీ పేద ప్రజల కోసం ఒక్క పథకమైనా అమలు చేయలేదని, తాము చేసిన పనులు చెప్పుకోలేకనే ఆ పార్టీ నాయకులు చిత్రపటాలను, క్యాలెండర్లను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చిత్రపటాలు కడుపు నింపుతాయా, ఆకలి తీర్చుతాయా ఆలోచించాలని కోరారు. వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ను ఉన్నతస్థాయిలో నిలుపుతారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో కరీంనగర్‌లో నగరపాలక సంస్థ రోజు తాగునీటిని సరఫరా చేస్తే కాంగ్రెస్‌ నాలుగునెలల పాలనలో రెండురోజులకోసారి నీళ్ళు ఇస్తున్నారన్నారు. రేవంత్‌సర్కార్‌ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్‌ కరీంనగర్‌కు వచ్చి సాగు, తాగునీరు అందించాలని, 500 బోనస్‌ ఇచ్చి రైతులకు అండగా నిలువాలని డిమాండ్‌ చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు సీఎం మాట్లాడాల్సిందేనా ఒక్కసారి ఆలోచించాలని కోరారు.తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం, ఆరు గ్యారెంటీల అమలు కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని హరీష్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎంపీగా వినోద్‌కుమార్‌ కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ తెచ్చిఅభివృద్ధికి బాటలు వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంపీగా 2014లో గెలిచి కరీంనగర్‌ను అభివృద్ధి చేశానని, 2019లో ఓడిపోయినా ఇక్కడే ఉండి కరీంనగర్‌ ప్రజల కోసం పనిచేశానని, తనను మళ్లీ ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:50 PM