Share News

తెలంగాణాను ఎడారి చేస్తే ఊర్కొనేది లేదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:53 AM

తెలంగాణను ఏడారి చేస్తే ఊర్కొనేది లేదని, రైతాంగ సమస్యలపై సమష్టిగా పోరాడుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణాను ఎడారి చేస్తే ఊర్కొనేది లేదు
మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

- సాగు, తాగునీటితోపాటు సమస్యలపై పోరాడుదాం

- కాంగ్రెస్‌, బీజేపీల కుట్రలను ఎండగడదాం

- వంద రోజుల తర్వాత సత్తా చూపుదాం

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 5: తెలంగాణను ఏడారి చేస్తే ఊర్కొనేది లేదని, రైతాంగ సమస్యలపై సమష్టిగా పోరాడుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే పార్టమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గంగుల కమలాకర్‌ కోరారు. కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలను ఎండగట్టి బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకోవలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే అప్పుడే కష్టాలు మొదలయ్యాయని, కరెంటు కోతలు, నీటి కటకటలు, సాగునీరు లేక గోసపడుతున్నారని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. వంద రోజుల తర్వాత హామీల అమలు కోసం బరిగీసి కొట్లాడుతామని స్పష్టం చేశారు.

ఫ సీఎం రేవంత్‌రెడ్డి మాటలు దుర్మార్గం

- మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

సీఎం రేవంత్‌రెడ్డి సీఎం పదవికి మచ్చతెచ్చేలా మాట్లాడడం దుర్మార్గమని, మాజీ సీఎం కేసీఆర్‌పై రండ అని వాడిన పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఇలాంటి భాషను వాడలేదని గుర్తు చేశారు. పార్టీల మధ్య విమర్శలు ఉండాలే కానీ ఇలాంటి విమర్శలు తప్పని ఖండించారు. పార్లమెంట్‌ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అవసరం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ళ కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. బండి సంజయ్‌ ఎంపీగా గెలిచిన తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యాడని, ఐదేళ్ళలో ఆయన ఐదు కొత్తల నిధులు నియోజకవర్గానికి తీసుకురాలేదని విమర్శించారు. ఐదేళ్లలో ఎన్ని ఊర్లు తిరిగాడో సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతోనే బండి సంజయ్‌ లోకల్‌... నాన్‌ లోకల్‌ ఫీలింగ్‌ తెస్తున్నాడని, తాను కూడా కరీంనగర్‌ గడ్డపైనే పుట్టినవాడినని వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎంపీగా తానుఐదేళ్ళలో ఏమి చేశానో, ఐదేళ్లలో బండి సంజయ్‌ ఏమి అభివృద్ధి చేశాడో అంకెలతో సహా చెప్పేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. బండి సంజయ్‌ రాముడిని రాజకీయంగా వాడుకుంటున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే బీజేపీ చేస్తున్న కుట్రలను పటాపంచలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైనికాల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీల నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబలు చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య, జడ్పీటీసీలు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ కార్యకర్తలకు గుర్తింపు ఏది?

- నేతలను నిలదీసిన నాయకుడు

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తింపు ఇవ్వక పోవడం వల్లనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయింది.. పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ ఉంది... అంటూ కామారపు శ్యామ్‌ అనే నాయకుడు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి ప్రసంగిస్తున్న సమయంలో నిలబడి మాట్లాడటంతో ఒక్కసారిగా సమావేశంలో రసభసా నెలకొన్నది. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించాలంటూ ఇప్పుడు కార్యకర్తలను అడుగుతున్నారని, అధికారంలో ఉండగా ఎందుకు పట్టించుకోలేదంటూ ఆయన నేతలను నిలదీశారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌తోపాటు పార్టీనేతలంతా ఈ సమావేశంలో మాట్లాడటం సరికాదంటూ పదేపదే చెప్పినప్పటికి ఆయన వినలేదు. దీంతో నాయకులు, కార్యకర్తలు లేవడం... ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ దళితబంధులో నీకు 10 లక్షలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాకు కాదు.. కార్యకర్తలందరికీ ఏమి చేశారంటూ ఆయన ప్రశ్నించడంతో కొద్దిసేపు రసభసా జరిగింది.

Updated Date - Feb 06 , 2024 | 01:53 AM