Share News

తాగునీటి ఎద్దడి తీరేదెలా?

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:37 AM

ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన పనుల విషయమై అధికార యంత్రాంగం తంటాలు పడుతున్నది. ప్రతిరోజు ఉదయమే అదనపు కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పనులు ముందుకు సాగేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు.

తాగునీటి ఎద్దడి తీరేదెలా?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన పనుల విషయమై అధికార యంత్రాంగం తంటాలు పడుతున్నది. ప్రతిరోజు ఉదయమే అదనపు కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పనులు ముందుకు సాగేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి సైతం మండలాల వారిగా కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనులన్నింటినీ ప్రారంభించే విధంగా జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అందిస్తున్నారు. అయితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు అడుగంటడంతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. దీంతో గ్రామాల్లో అక్కడక్కడా సరిపడా తాగునీరు ప్రజలకు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కడైతే గ్రామాల్లో క్రిటికల్‌ గ్యాప్స్‌ ఉన్నాయో వాటిని గుర్తించాలని ప్రభుత్వం నెలరోజుల క్రితం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆ మేరకు మిషన్‌ భగీరథ ఇంట్రా విలేజ్‌ అధికారులు జిల్లా వ్యాప్తంగా కోటి 83 లక్షల రూపాయల విలువైన క్రిటికల్‌ గ్యాప్స్‌ పనులను గుర్తించారు. ఇందులో ప్రధానంగా పైపులైన్ల మరమ్మతులు, చేతిపంపుల మరమ్మతులు, పాత స్కీంలకు మోటార్ల బిగింపు వంటి పనులు తాత్కాలికంగా చేయాలని నిర్ణయించారు. పనులన్నీ 30వేల నుంచి 3 లక్షల లోపు మాత్రమే ఉండడంతో నామినేషన్‌ ప్రాతిపదికన పనులు అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం ఏదైనా కాంట్రాక్టు పనులు చేయాలంటే దానికి ముందుగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కనీసం ప్రొసీడింగ్స్‌ అయినా ఉండాలి.

ఫ అగ్రిమెంట్లు చేసుకునే పరిస్థితి లేదు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో కొత్తగా చేపట్టే పనులకు అగ్రిమెంట్లు చేసుకునే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల నియామావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు పనులు చేసే వారితో ఒప్పందాలు చేసుకోలేకపోతున్నారు. ఒప్పందాలు లేక అధికారుల మాట విని పనులు చేస్తే బిల్లులు రాకపోతే ఎలా అని పనులు చేసేవాళ్లు వాపోతున్నారు. ఎన్నికల కోడ్‌ జూన్‌ 10వ తేదీ వరకు ఉన్నందున ఎలాగైనా పనులు చేసి జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక అధికారులు, గ్రామకార్యదర్శులపై ఒత్తిడి తీసుకవస్తుండడంతో వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జనవరి మాసంతో ముగిసినందున ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. అటు ప్రత్యేక అధికారులు, ఇటు గ్రామ కార్యదర్శులు తాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టాల్సిన క్రిటికల్‌ గ్యాప్స్‌ పనులు చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మాజీ సర్పంచుల సైతం ఎవరు ముందుకు రావడం లేదు. తమ హయాంలో చేసిన కొన్ని బిల్లులు రాకపోవడమే ఎందుకు కారణమని అంటున్నారు. జిల్లాలో అక్కడక్కడా మాత్రమే పనులు జరుగుతున్నాయి. 50 శాతానికి పైగా పనులు జరగడం లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రత అంతగా లేనప్పటికీ, దినదినం ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచి కొడుతుండడంతో వచ్చే నెలలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటినుంచే అప్రమత్తం అవుతున్నారు. ఒప్పందాలు లేకుండా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోగా, ఈ పనులను ఎలా చేసేదని ప్రత్యేక అధికారులు గ్రామకార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:37 AM