మెగా డీఎస్సీతో చిగురించిన ఆశలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:31 AM
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను 2018లో భర్తీ చేసింది.
- జిల్లాలో 225 ఉపాధ్యాయ పోస్టులు
- మరో 20 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 29: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను 2018లో భర్తీ చేసింది. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించిన ప్రభుత్వం 2023లో సెప్టెంబరు 6న 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఇచ్చిన హామీ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న 5,089 పోస్టులతోపాటు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఫ పెరిగిన పోస్టులు
తాజా నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగాయి. గత నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్‌లతో కలిసి మొత్తం 99 పోస్టులుండగా మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య 225కు చేరాయి. వీటితోపాటు అదనంగా మరో 20 ప్రత్యేక ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ ఐదు, ఎస్జీటీ 15 పోస్టులు కూడా జత చేశారు. దీంతో జిల్లాలో 245 మందికి ఉపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఏర్పడింది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 86, లాంగ్వేజ్ పండిట్లు 18, పీఈటీలు 7, ఎస్జీటీలు 114, మొత్తం 225 ఖాళీలు ఈ డీఎస్సీలో భర్తీ కానున్నాయి.
ఫ గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం
గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 4 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈసారి పరీక్షలను గతంలో మాదిరిగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని విద్యాశాఖ సూత్రప్రాయంగా తెలిపింది. పరీక్షలను ప్రశాంతంగా, ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా, అక్రమాలకు, పైరవీలకు తావులేకుండా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.