Share News

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:38 AM

నామినేటెడ్‌ పదవులపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెంచుకున్నారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడి ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నామినేటెడ్‌ పదవులపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెంచుకున్నారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడి ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశీస్సుల కోసం, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయన దృష్టిలో పడేందుకు పలువురు నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలను కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ గెలుపొందారు. శ్రీధర్‌బాబు సీనియర్‌ కావడంతో ఆయనకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు చెందిన వారికి మంత్రి పదవులు దక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ప్రభుత్వ విప్‌ పదవులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా నుంచి ఎవరికి కూడా నామినేటెడ్‌, ప్రభుత్వ విప్‌ పదవులు దక్కకపోగా, నామినేటెడ్‌ పోస్టులు వరించాయి. ఐడీసీ చైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ, బుద్ధ వనం ట్రస్టు చైర్మన్‌గా మల్లెపల్లి లక్ష్మయ్య, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా గంటా చక్రపాణి, ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా కోలేటి దామోదర్‌, ఫిషరీస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌గా పిట్టల రవీందర్‌, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ చిరుమల్ల రాకేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రఘువీర్‌సింగ్‌ తదితరులకు నామినేటెడ్‌ పోస్టులు దక్కిన విషయం తెలిసిందే. వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టులన్నింటికీ ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఇంకా రద్దు కాలేదు. మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలను కూడా రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి టిక్కెట్‌ రాగా, పార్టీ టిక్కెట్‌ పొందిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన వారికి, పార్టీ కోసం అహర్నిషలు కష్ట పడుతున్న ద్వితీయశ్రేణి నాయకులకు నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టుల కోసం ఇప్పటికే పలువురు నాయకులు ప్రయత్నాలు చేసుకుంటుండగా, పార్టీ కొందరు సీనియర్‌ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నది. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం నుంచి శశిభూషణ్‌ కాచె, గంట వెంకటరమణారెడ్డి, ఇనుముల సతీష్‌, ఒడ్నాల శ్రీనివాస్‌, తొట్ల తిరుపతియాదవ్‌, ఉప్పట్ల శ్రీనివాస్‌, చొప్పరి సదానందం, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, గోపగాని సారయ్య, సయ్యద్‌ మస్రత్‌, అన్నయ్యగౌడ్‌, మినుపాల ప్రకాష్‌రావు, గీట్ల రాజేందర్‌రెడ్డి, గుండేటి అయిలయ్య యాదవ్‌, భూషణవేని రమేష్‌గౌడ్‌, ఎలువాక రాజయ్య, రేగుంట అశోక్‌, దన్నాయక్‌ దామోదర్‌రావు, సాంబి రెడ్డి, తదితరులు నామినేటెడ్‌ పోస్టులను ఆశిస్తున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఏఐసీసీ సభ్యుడు హర్కార వేణుగోపాల్‌ రావు, ఐఎన్‌టీయూసీ నాయకులు గుమ్మడి కుమారస్వామి, బాబర్‌ సలీం పాషా, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్‌, సూర సమ్మయ్య తదితర నాయకులు పదవులను ఆశిస్తున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు నాయకులకు మాత్రమే రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పోస్టులు వరించనున్నాయి. మరికొందరికి జిల్లా స్థాయిలో ఉండే జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ కమిటీ, ఎండోమెంట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు వరించనున్నాయి. వీరేగాకుండా మరికొందరు నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:38 AM