Share News

ఆశాజనకంగా ‘రవాణా’ ఆదాయం

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:34 AM

జిల్లా రవాణాశాఖకు ఆశించిన రీతిలోనే ఆదాయం లభించింది. లక్ష్యానికి దగ్గరలోనే నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.37.97 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.37.70 కోట్ల ఆదాయం లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.33.08 కోట్లు ఆదాయం వచ్చింది.

   ఆశాజనకంగా ‘రవాణా’ ఆదాయం
వాహనాల పత్రాలను పరిశీలిస్తున్న డీటీవో

- 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో రూ.37.70 కోట్లు

- 2022- 23 సంవత్సరం కంటే రూ.4.64 కోట్లు అధికం

- జిల్లాలో 1,40,374 వాహనాలు

- జిల్లా రవాణా శాఖ ప్రోగ్రెస్‌ రిపోర్టు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లా రవాణాశాఖకు ఆశించిన రీతిలోనే ఆదాయం లభించింది. లక్ష్యానికి దగ్గరలోనే నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.37.97 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.37.70 కోట్ల ఆదాయం లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.33.08 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సారి రూ.4.64 కోట్ల ఆదాయం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ట్యాక్స్‌ లక్ష్యం రూ.5.83 కోట్లు కాగా 6.70 కోట్లు ఆదాయం సమకూరింది. లైఫ్‌ ట్యాక్స్‌లో రూ.23.15 కోట్లు లక్ష్యం కాగా రూ.23.80 కోట్లు, వివిధ ఫీజుల ద్వారా రూ.4.96 కోట్లకు రూ.4.93 కోట్ల ఆదాయం లభించింది. సర్వీస్‌ ఫీజులు రూ.1.23 కోట్లు లక్ష్యంగా రూ.1.28 కోట్లు లభించింది. జరిమానాల ద్వారా రూ.97.7 లక్షలు లభించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.33.05 కోట్ల ఆదాయం లభించగా అందులో త్రైమాసిక ట్యాక్స్‌ రూ.5.24 కోట్లు, లైప్‌ ట్యాక్స్‌ ద్వారా రూ 20.51 కోట్లు, ఫీజులు రూ.4.83 కోట్లు, సర్వీస్‌ ఫీజులు రూ.1.22 కోట్లు, జరిమానాల రూపంలో రూ.1.23 కోట్లు లభించాయి.

వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి

జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల జనాభా ఉంది. దాదాపు 1.77 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాహనాలు కూడా 1.40 వాహనాలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ద్విచక్రవాహనాలు 96,587, కార్లు 12,155, రవాణా క్యాబ్‌లు 141, లగ్జరీ టూరిస్ట్‌ క్యాబ్‌లు 141, జీపులు 13, మోటార్‌ క్యాబ్‌లు 1068, ప్రైవేటు ఓమినీ బస్సులు 217, రోడ్‌ రోలర్‌లు 3, స్టేజీ క్యారియర్‌లు మోపెడ్‌, అండ్‌ మోటారైజ్‌డ్‌ సైకిల్‌ 4359, త్రీవిలర్‌ గూడ్స్‌ వాహనాలు 1373, వ్యవసాయ ట్రాక్టర్‌లు 4193, సరుకుల రవాణా వాహనాలు 3335, ప్రైవేటు క్రేన్‌లు 8, కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వాహనాలు 235, హార్వేస్టర్‌లు 828, అంబులెన్స్‌లు 36, ఆటోలు 3548తోపాటు ఇతర వాహనాలు కూడా పెరిగాయి.

ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు సకాలంలో చెల్లించాలి

- లక్ష్మణ్‌ జిల్లా రవాణాశాఖ అధికారి

వాహనాల యజమానులు ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు, సకాలంలో చెల్లించాలి. ఎప్పుడైనా ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పరిహారం పొందే వీలు ఉంటుంది. ట్యాక్స్‌ల చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నాం, జిల్లా రవాణా శాఖ ఆదాయం ముగిసిన అర్థిక సంవత్సరంలో రూ.37.70 కోట్లు వచ్చింది. వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్‌, ట్యాక్స్‌లు, చెల్లించాలి.

Updated Date - Apr 05 , 2024 | 12:34 AM