Share News

హైవే పనులు షురూ..

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:09 AM

జిల్లాలో నాలుగు లైన్ల నేషనల్‌ హైవే-163 పనులు ఊపందుకోనున్నాయి.

హైవే పనులు షురూ..

మంథని, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నాలుగు లైన్ల నేషనల్‌ హైవే-163 పనులు ఊపందుకోనున్నాయి. దీంతో జిల్లాలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో భారీగా భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రైతుల భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో భూములకు డిమాండ్‌ వస్తుండడంతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంథని మండలంలోని కన్నాల-పందులపల్లి గ్రామాల శివారులో ఇటీవల అధికారులు ట్రెంచ్‌ కట్టింగ్‌ పనులను ప్రారంభించారు. దీంతో జిల్లాలో నేషనల్‌ హైవే నిర్మాణానికి అడుగుపడింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మూడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నేషనల్‌ గ్రీన్‌ఫీల్డు ఎక్స్‌ప్రెస్‌ హైవే-163 నిర్మాణాన్ని కేంద్రం ప్రతిపాదించింది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే తరహాలో పట్టణాలు, జనవాసాలకు దూరంగా మైదాన ప్రాంతాల మీదుగా సాగే జాతీయ రహదారి చేపడుతున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్స్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో మంచిర్యాల-వరంగల్‌ సెక్షన్‌ విభాగంలో 2ప్యాకేజీల్లో నేషనల్‌ హైవేను నిర్మించనున్నారు. పరిహారం చెల్లింపు కోసం ఇప్పటికే కొందరు నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. అడ్డంకులు సైతం పెద్దగా లేకపోవడంతో జిల్లా ప్రజలకు త్వరలోనే జాతీయ రహదారి కల నెరవేరనుంది. దీంతో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు పలు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది.

ఇది జాతీయ రహదారి సమగ్ర సమాచారం..

ఈ జాతీయ రహదారికి 2021 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డు కారిడార్‌ నేషనల్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రూ.14,666 కోట్ల నిధుల ప్రతిపాదనతో 405 కిలోమీటర్ల ప్రాజెక్టును 2027 పూర్తిచేయాలని కాలపరిమితి పెట్టుకున్నారు. తొలి ప్యాకేజీ నిర్మాణం మంచిర్యాల నుంచి వరంగల్‌ వరకు, ప్యాకేజీ-2లో జిల్లాలోని మంథని-రామగిరి-ముత్తారం మండలాల మీదుగా నేషనల్‌ హైవే నిర్మాణం జరగనున్నది. జిల్లాలో 16 గ్రామాల్లో 40 కిలో మీటర్ల రహదారికి రూ. 2,607 కోట్లు కేటాయించారు.

ప్యాకేజీ-7లో నార్వ నుంచి పుట్టపాక హైవే నిర్మాణం..

ప్యాకేజీ-7 కింద చేపట్టే ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును విభజించిన 3 ప్యాకేజీల్లో భాగంగా మంచిర్యాల సమీపంలోని నార్వ ప్రాంతం నుంచి మంథని మండలం పుట్టపాక వరకు 31.466 కిలోమీటర్లు మొదటి విడతలో తీసుకున్నారు. రెండో ప్యాకేజీలో పుట్టపాక నుంచి పింగిరెడ్డిపల్లి వరకు 37.050 కిలో మీటర్ల రహదారిని నిర్మించనున్నారు. మూడో ప్యాకేజీలో పింగిరెడ్డిపల్లి నుంచి ఊరగొండ వరకు 39.890 కిలో మీటర్ల హైవేను నిర్మించనున్నారు.

16 గ్రామాల గుండా 4 లైన్ల నేషనల్‌ హైవే నిర్మాణం..

4లైన్ల జాతీయ రహదారి మంథని మండలం ఉప్పట్ల గోదావరి సమీపం నుంచి పోతారం, విలోచవరం, నాగారం, కన్నాల, పందులపల్లి, పుట్టపాక, రామగిరి మండలంలోని ఆదివారంపేట, బేగంపేట, నవాబ్‌పేట, ముత్తారం మండలంలోని లక్కారం, కేశనపల్లి, ముత్తారం, అడవిశ్రీరాంపూర్‌, ఓడేడ్‌ మీదుగా భూపాలపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. మూడు మండలాల పరిధిలోని 16 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా.

బేగంపేట, పుట్టపాక వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం..

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంథని మండలం పుట్టపాక సమీపంలో రింగ్‌ రోడ్డు, ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. అలాగే రామగిరి మండలం బేగంపట వద్ద ఫ్లైఓవర్‌ ప్రతిపాదిందించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా మంచిర్యాల, పెద్దపల్లితో పాటు కరీంనగర్‌, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాల ప్రజలకు నేషనల్‌ హైవే రహదారి అందుబాటులోకి రానుంది.

ట్రెంచ్‌ కట్టింగ్‌ పనులు ప్రారంభం..

మంచిర్యాల-వరంగల్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-163 నిర్మాణానికి సేకరించిన మండలంలోని కన్నాల-పందులపల్లి భూముల్లో జాతీయ రహదారుల అథారిటీ ట్రెంచ్‌ కట్టింగ్‌ పనులు ప్రారంభించారు. మంచిర్యాల-వరంగల్‌-ఖమ్మం జిల్లాలను కలిపే 4 లైన్ల గ్రిన్‌ ఫీల్డు నేషనల్‌ హైవే కోసం సేకరించిన భూములను ఎన్‌హెచ్‌ఆర్‌ఏకి అప్పగించారు. దీంతో ట్రెంచ్‌ కట్టింగ్‌ పనులను ప్రారంభించామని, నేషనల్‌ హైవే నిర్మాణం పనులు సకాలంలో పూర్తి అయ్యేలా జిల్లా యంత్రాంగం వారికి సహకరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

రాకతో.. భూముల ధరలకు రెక్కలు..

జిల్లాలోని మూడు మండలాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభమైన నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దూకుడు పెంచారు. సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించే పనిలో ఉన్నారు. సాధారణంగా ఎకరాకు రూ.25 నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతుండగా, వ్యాపారులు ఏకంగా రూ.కోటిపైగా పెంచారు. రైతులు సైతం తమ భూములకు డిమాండ్‌ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 01:09 AM