Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వేడెక్కుతున్న రాజకీయాలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:11 AM

లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ వాతావరణం వేడేక్కుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌ సభ స్థానాల్లో పోటీకి నిలపనున్న అభ్యర్థుల ఎంపిక పూర్తి కాక ముందే అన్ని రాజకీయ పక్షాలు పార్టీ ప్రచారంపై దృష్టి సారించాయి.

వేడెక్కుతున్న రాజకీయాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ వాతావరణం వేడేక్కుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌ సభ స్థానాల్లో పోటీకి నిలపనున్న అభ్యర్థుల ఎంపిక పూర్తి కాక ముందే అన్ని రాజకీయ పక్షాలు పార్టీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఏ పేరుతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రధాన ఎజెండా లోక్‌ సభ ఎన్నికలే. కరీంనగర్‌ లోక్‌ సభ స్థానం నుంచి బీజేపీ ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. పెద్దపల్లి లోక్‌ సభ స్థానం నుంచి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులుగా ఎవరిని నిలిపేది ఆ పార్టీల నాయకత్వం ఇంకా ప్రకటించలేదు.

- విస్తృతంగా నేతల పర్యటనలు

బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తన నియోజక వర్గ పరిధిలో ప్రజాహిత యాత్రను చేపట్టి మొదటి విడతను పూర్తి చేసుకుని రెండో విడత పర్యటిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల్లో 119 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రధాన గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా ఆయన యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం హుస్నాబాద్‌, హుజూరాబాద్‌ నియోజక వర్గాల్లో ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం కాకున్నా ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనుండడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఆయన 7న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసి వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం గుడి చెరువు మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఎన్నికల సమయం కావడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కరీంనగర్‌ లోక్‌ సభ నియోజక వర్గ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రజలు ఈ బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభగానే దీనిని భావిస్తున్నారు. ఈ నెల 12న బీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకత్వం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో శంఖారావ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఆయన ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి కీలక సందర్భంలోనూ కరీంనగర్‌ ప్రధాన పాత్ర పోషిస్తు వస్తూ ట్రెండ్‌సెట్టర్‌ జిల్లాగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయ వాతావరణం వేడేక్కడాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:11 AM