Share News

హరీష్‌ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:41 PM

హరీష్‌రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాం నగర్‌లో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారని గుర్తు చేశారు.

హరీష్‌ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి
ఇస్లాంనగర్‌లో మాట్లాడుతున్న విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

- విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 25 : హరీష్‌రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాం నగర్‌లో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారని గుర్తు చేశారు. త్వరలోనే ఇస్లాం నగర్‌ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భాజపా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ గమనించాలన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చారని, నేతన్నలకు జీఎస్టీ విధించిందన్నారు. దేశాన్ని మతం, ప్రాంతాల పేరిట విడదీయాలని చూస్తోందన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ రైతు వర్గాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని వ్యతిరేకించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. దానికి వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు, భారత్‌ జోడో పాదయాత్ర చేశారన్నారు. దేశంలో మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి బీజేపీకి వ్యతిరేకంగా ఉందని తెలిసి నరేంద్ర మోదీని భయం పట్టుకుందన్నారు. బీజేపీ ప్రజల్లో భాగోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతానని అన్నారని, అది సాధ్యం కాదని హరీష్‌ రావు మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ కాకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోందన్నారు. గడిచిన పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్‌ఎస్‌ వారు ఓర్వలేక పోతున్నారన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బింగి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:41 PM