Share News

గృహజ్యోతి, మహాలక్ష్మి ప్రారంభం

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:30 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని మరో రెండింటి అమలుకు శ్రీకారం చుట్టింది. 500 రూపాయలకే గ్యాస్‌సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

గృహజ్యోతి, మహాలక్ష్మి ప్రారంభం

(ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని మరో రెండింటి అమలుకు శ్రీకారం చుట్టింది. 500 రూపాయలకే గ్యాస్‌సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మహాలక్ష్మి వంట గ్యాస్‌ పథకం కోసం 9,33,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. 8,09,496 మంది ఉచితంగా నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను పొందేందుకు ప్రజాపాలనలో అర్జీ పెట్టుకున్నారు. గత డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రజల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తెల్లరేషన్‌ కార్డు ఉండి ఆహారభద్రతా పథకం కింద లబ్ధి పొందుతూ రెగ్యులర్‌ గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగిస్తున్న మహిళలకు 500 రూపాయలకు సిలిండర్‌ను అందివ్వనున్నారు. మూడు సంవత్సరాల సగటు వినియోగం మేరకు సిలిండర్లను ఇస్తారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకునేవారికి జీరో బిల్లింగ్‌తో ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఇంటి యజమానులతోపాటు అద్దెకు ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఫ లబ్ధిదారుల గుర్తింపు ఇలా..

ఇంటి కనెక్షన్‌ నంబర్‌, తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును జతచేసి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని లబ్ధిదారులుగా గుర్తిస్తారు. గ్యాస్‌ కనెక్షన్‌ నంబర్‌, బ్యాంకుఖాతాలు, ఆధార్‌నెంబర్‌, ఆహారభద్రతా కార్డు నంబర్లను పరిశీలించి, వాటిని సమర్పించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. మహాలక్ష్మి లబ్ధిదారులు మొత్తం సిలిండర్‌ ధర చెల్లించి రీఫిల్‌ సిలిండర్‌ను తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ కంపెనీలకు సబ్సిడీ సొమ్మును జమ చేస్తుంది. మార్కెటింగ్‌ కంపెనీలు లబ్ధిదారులు మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్‌ తీసుకున్న తర్వాత సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమచేస్తాయి. మహాలక్ష్మి పథకం కింద కరీంనగర్‌ జిల్లాలో 2,72,292 మంది, పెద్దపల్లి జిల్లాలో 2,01,702 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 1,65,274 మంది, జగిత్యాల జిల్లాలో 2,89,729 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారులుగా గుర్తిస్తారు. గృహలక్ష్మి పథకం కోసం కరీంనగర్‌ జిల్లాలో 2,35,091, పెద్దపల్లి జిల్లాలో 1,76,410, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,42,964, జగిత్యాల జిల్లాలో 2,55,031 దరఖాస్తులు వచ్చాయి.

ఫ కాంగ్రెస్‌శ్రేణుల సంబురాలు

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని మహలక్ష్మి, గృహలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించడం పట్ల జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో పార్టీనాయకులు స్వీట్లను పంపిణీ , సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 12:30 AM