Share News

‘ఇసుక’ తవ్వకాలపై సర్కారు దృష్టి

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:18 AM

మానేరులో నిలిపివేసిన ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో భవన నిర్మాణాలు పెరగడంతో దానికి కావలసిన ఇసుక కొరత ఏర్పడింది.

‘ఇసుక’ తవ్వకాలపై సర్కారు దృష్టి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మానేరులో నిలిపివేసిన ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో భవన నిర్మాణాలు పెరగడంతో దానికి కావలసిన ఇసుక కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానేరులోగల ఇసుక రీచుల్లో తవ్వకాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మానేరుపై ఏర్పాటుచేసిన 25 ఇసుక రీచులకు సంబంధించి తవ్వకాల కాలపరిమితి డిసెంబరు నెలాఖరుతో ముగియడంతో కలెక్టర్‌ ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. గడువులోపు తవ్విన ఇసుకను డంపింగ్‌ యార్డులో నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, బుకింగ్‌కు మించి ఓవర్‌లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారని, కొన్నిచోట్ల వేబిల్లులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై దృష్టి సారించింది. అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ఓవర్‌లోడ్‌ లేకుండా చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడే విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తదితర ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టారు. రాష్ట్ర రాజధానిలో దినదినం పెరుగుతున్న భవన నిర్మాణాలకు తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆయా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా గడువు ముగియడం వల్లనే ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఇసుక కొరత నేపథ్యంలో విధివిధానాల్లో మార్పులు, చేర్పులు చేసి, అక్రమాలు జరగకుండా ఇసుక తవ్వకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇసుక తవ్వకాల వల్ల కొరతను తీర్చడంతో పాటు ప్రభుత్వానికి తద్వారా ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దపల్లిలోగల మానేరు నదిలో ఇసుకను తోడే విషయమై దృష్టి సాధించినట్లు సమాచారం.

ఫ కలెక్టర్‌ నేతృత్వంలో సమావేశం..

మానేరు నదిపై సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి, గట్టేపల్లి, కదంబాపూర్‌, తొగర్రాయి, ఓదెల మండలం మడక, గుండ్లపల్లి, కనగర్తి, పొత్కపల్లి, రూపునారాయణపేట, ఇందుర్తి, గుంపుల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌, మొట్లపల్లి, ముత్తారం మండలం ఓడేడు, అడవి శ్రీరాంపూర్‌, మంథని మండలం గోపాలపూర్‌, చిన్న ఓదాల వద్ద నిర్మిస్తున్న చెక్‌ డ్యాం ల్లో 132,00,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడి తరలించేందుకు 25 రీచుల కోసం 2022 జనవరి 11వ తేదీన టీఎన్‌ఎండీసీ ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. చెక్‌డ్యామ్‌ లోపల పెద్దఎత్తున ఇసుక పేరుకుపోయిందని, దీని వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగదని, రెండు మీటర్ల లోతు వరకు ఇసుక తొలగించాలని సంబంధిత అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ మేరకు టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుకను తరలించేందుకు టెండర్లు జారీ చేసింది. ఇసుక రీచుల్లో ఇసుకను తోడి వాహనాల ద్వారా డంపింగ్‌ యార్డుల వరకు తీసుకవచ్చి అక్కడ లోడింగ్‌ చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. పలువురు కాంట్రాక్టర్ల టెండర్లలో పాల్గొని ఇసుక రీచులను దక్కించుకున్నారు. డిసెంబరు 31 వ తేదీ వరకు మానేరు ఇసుక తీసిన నుంచి సుమారు 65 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అధికారికంగా విక్రయించారు. అనధికారికంగా మరో 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలించినట్లు తెలుస్తున్నది. జిల్లా స్థాయి సాండ్‌ కమిటీ విధించిన గడువు డిసెంబరు నెలాఖరుతో ముగియడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. చెక్‌డ్యాం లోపల ఇంకా ఉందని, ఆ ఇసుకను తోడితేనే చెక్‌ డ్యాముల్లో నీళ్లు నిలువ ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. లక్షా 32 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, అధికారికంగా 62 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వారు. ఇంకా సుమారు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మానేరులో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని, దుమ్ము ధూళితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, ఓవర్‌ లోడుతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని మానేరు పరిరక్షణ సమితి ఇసుక ప్రజలను నిలిపివేయాలని చెన్నై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన తీర్పు పెండింగ్‌లో ఉన్నది. ఈనెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలో గానీ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా స్థాయి సాండ్‌ కమిటీ సమావేశం నిర్వహించి ఇసుకతో తవ్వకాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇసుక రీచ్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటివరకు మాకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని, ఇసుక తవ్వకాల బాధ్యత తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Updated Date - Feb 17 , 2024 | 01:18 AM