Share News

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:12 AM

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యవైపు ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన
వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యవైపు ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అన్ని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మానవ సహజ కార్యక్రమంలో భగవంతుడి సంకల్పం ఉండాలన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా సమృద్ధిగా వర్గాలు పడి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇస్తూ దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వానికి దేవుడితోపాటు ప్రజల ఆశీర్వచనం ఉండాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంటు ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 01:12 AM