Share News

మిడ్‌ మానేరుకు గోదావరి జలాలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:15 AM

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మిడ్‌ మానేరుకు ఎత్తిపోయడం ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నంది మేడారంలో గల నంది పంప్‌హౌస్‌ ఒక మోటారును ఆన్‌ చేసి సాయంత్రం వరకు క్రమంగా నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

మిడ్‌ మానేరుకు గోదావరి జలాలు
నంది మేడారం పంప్‌హౌస్‌ నుంచి నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు

- శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ..

- నంది పంప్‌ హౌస్‌ 12,600 క్యూసెక్కుల నీటి తరలింపు

- ప్రభుత్వ ఆదేశాలతో మోటార్లు ఆన్‌ చేసిన అధికారులు

- ప్రవాహాన్ని బట్టి రోజుకు 2 టీఎంసీల తరలింపు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మిడ్‌ మానేరుకు ఎత్తిపోయడం ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నంది మేడారంలో గల నంది పంప్‌హౌస్‌ ఒక మోటారును ఆన్‌ చేసి సాయంత్రం వరకు క్రమంగా నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి పోయకుండానే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తుండడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం ఉదయం 14 వేల క్యూసెక్కులు, ఆ తర్వాత 13 వేలు, ఆ తర్వాత 16 వేలు, సాయంత్రం వరకు 12 వేల క్యూసెక్కులకు పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాజెక్టు నీటి మట్టం 17.396 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ధర్మారం మండలంలో గల నంది పంప్‌హౌస్‌కు గ్రావిటీ ద్వారా నీటిని వదిలిపెట్టారు. అక్కడి నుంచి మొదట ఒక మోటారును ఆన్‌ చేసి క్రమంగా సాయంత్రం 5 గంటల వరకు నాలుగు మోటార్లు ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోశారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా అండర్‌ టన్నెల ద్వారా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ నుంచి మోటార్ల ద్వారా వరద కాలువలో నీటి ఎత్తిపోయడంతో మిడ్‌ మానేరుకు వెళుతున్నాయి. నంది మేడారం పంప్‌హౌస్‌లో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటార్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మొత్తం మోటార్లు నడిస్తే 22,050 క్యూసెక్కుల నీళ్లు అంటే 2 టీఎంసీల నీటిని తరలించవచ్చు. రోజుకు రెండు టీఎంసీలను తరలించే విధంగా అండర్‌ టన్నెళ్లు, పంప్‌హౌస్‌లను నిర్మించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సాయంత్రం వరకు 12,931 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి పోవడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం, సుందిళ్ల బ్యారేజీకి స్వీపేజీ సమస్య ఉండడంతో వీటిని సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం మరమ్మతులు చేయాలని సూచించింది. వాటికి మరమ్మతులు జరుగుతుండగానే వర్షాలు మొదలయ్యాయి. దీంతో ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు మూడు బ్యారేజీల గేట్లు తెరిచి ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడం లేదు. ఎల్లంపల్లి ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలు, కడెం ప్రాజెక్టు నిండి తద్వారా వస్తున్న అదనపు జలాలతో వారం రోజుల్లో 13 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులోకి వచ్చాయి. ఈ నెల 18వ తేదీ వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 5.140 టీఎంసీలు కాగా, ఆ మరుసటి రోజు నుంచి కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ (మిడ్‌ మానేరు) పూర్తి స్థాయి నీటి మట్టం 27 టీఎంసీలు కాగా, అందులో 6 టీఎంసీలు, లోయర్‌ మానేరు డ్యామ్‌ నీటి మట్టం 24 టీఎంసీలు కాగా, అందులో 6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో పెద్దగా వరద లేక పోగా, ఎస్సారెస్పీకి కూడా వరద లేదు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి వరద పెరిగిన తర్వాత మిడ్‌ మానేరుకు నీటిని తరలించాలని నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రాజెక్టు అధికారులకు సూచించింది. జూన్‌ మాసంలో పెద్దగా వర్షాలు పడక పోగా, జూలై మాసం ఆరంభంలో కూడా గడ్డు పరిస్థితులు ఉండడంతో, గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్‌ చేసి 8 నుంచి 9 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తి పోశారు. ఇంతలో వరుసగా భారీ వర్షాలు పడడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలి పెట్టారు. మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీల పరిస్థితి దయనీయంగా ఉండడంతో గేట్లను ఎత్తకుండా ఎత్తిపోతలను ప్రారంభించారు. ఎల్లంపల్లికి పై నుంచి వస్తున్న వరద నీటిని వచ్చినట్లే తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాలను అంచనా వేస్తూ ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. పైనుంచి వరద పెరిగితే మాత్రం రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - Jul 28 , 2024 | 01:15 AM