Share News

వైభవంగా బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:20 AM

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యరశ్మితో అగ్నిని పుట్టించి వైభవంగా అగ్నిప్రతిష్ఠ చేశారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 16: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యరశ్మితో అగ్నిని పుట్టించి వైభవంగా అగ్నిప్రతిష్ఠ చేశారు. వివిధ హోమాలు,నిత్యపూర్ణాహుతి చేశారు. అనంతరం ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. శ్రీవారిని భక్తులు దర్శించి పులకించిపోయారు. సాంస్కృతిక కళావేదికపై గాయకుడు, ఉత్సవాల కల్చరల్‌ ఆర్గనైజర్‌ సల్వాజి ప్రవీణ్‌ నేతృత్వంలో వివిధ భజనమండళ్ల పారాయణాలు, భజనలు, కీర్తనలతో ఆలయం మారుమోగింది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పురాణం మహేశ్వరశర్మ ప్రవచనం చేశారు. జానపద సినీ నేపథ్య గాయ కుడు జడల రమేశ్‌ బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. శుక్రవారంతో పాటు రథసప్తమి పర్వదినం కావటంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవో వుడుతల వెంకన్న, కాంగ్రేస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ పురుమల్ల శ్రీనివాస్‌, నగర కాంగ్రేస్‌ అఽధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, కాంగ్రేస్‌ నాయకుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

- నేటి కార్యక్రమాలు..

శనివారం ఉదయం 8 గంటల నుంచి నిత్యహోమం, కల్పవృక్షవాహనసేవ, పద్మశాలి సంఘం వారిచే సారె సమర్పణ, సాయంత్రం 6 గంటల నుంచి అశ్వ, గజ వాహన సేవలతో ప్రకాశంగంజ్‌ వరసిద్ధి వినాయకస్వామి దేవాలయం నుంచి ఎదుర్కోలు ఉత్సవం. సాంస్కృతిక వేదికపై ఉదయం, సాయంత్రం భజనలు, పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

Updated Date - Feb 17 , 2024 | 12:20 AM