Share News

జనం నుంచి వనంలోకి..

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:18 AM

వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు జిల్లాలో వైభవంగా సాగిన జాతర మహోత్సవం శనివారం సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 జనం నుంచి వనంలోకి..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు జిల్లాలో వైభవంగా సాగిన జాతర మహోత్సవం శనివారం సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డోలు, వాయిద్యాల మధ్య తల్లులు ఇద్దరు వన ప్రవేశం చేశారు. జిల్లాలో తొమ్మిది చోట్ల ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు తరలివచ్చిన భక్తులు తమ ఎత్తు బంగారాలు, చీర సారెలు, ఒడిబియ్యంతో ముడుపుల మొక్కులను సమర్పించుకున్నారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. తల్లులకు వీడ్కోలు పలుకుతూ చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు. ప్రభుత్వ విప్‌ ఆదిశ్రీనివాస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, అదనపు ఎస్పీ చంద్రయ్య, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వివిధ పార్టీల నాయకులు దర్శించుకున్నారు. జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి, వీర్నపల్లి మండలం శాంతినగర్‌ భానోజు గిరిజన తండా, బాబాయి చెరువుతండా, తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌, మండెపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు వంతడ్పుల, కందికట్కూర్‌, ముస్తాబాద్‌ మండల కేంద్రం, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో నాలుగు రోజుల పాటు భక్తులు తల్లులు కొలువైన గద్దెల వద్దకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు కుటుంబాలతో సహా గద్దెల వద్దనే ఉండి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కష్టాలు తొలగించాలని, మళ్లీ రెండేళ్లకు వచ్చే జాతరకు వస్తామని మొక్కులు చెల్లించుకుంటామని వేడుకున్నారు. సమ్మక్క, సారలమ్మల జాతరకు జిల్లా ప్రజలతో పాటు పొరుగుజిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు.

ఫ బొమ్మల దుకాణాల సందడి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా నాలుగు రోజుల సంబరాల్లో పిల్లలను కాక పెద్దలను సైతం బొమ్మల దుకాణాలు అలరించాయి. తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట, ముస్తాబాద్‌ మండలాల్లో జరిగిన సమ్మక్క, సారలమ్మల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తరలివచ్చి బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు గాజులు, రోల్‌గోల్డ్‌ ఆభరణాలు, ఇంట్లో ఉపయోగించే అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయి. నాన్‌ బ్యాండెడ్‌ వస్తువు కావడంతో ధర తక్కువగా ఉండడంతో ఆసక్తిగా కొనుగోలు చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతరలకు బొమ్మల దుకాణాలు శోభనిచ్చాయి.

Updated Date - Feb 25 , 2024 | 12:18 AM