Share News

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌పై దుమారం

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:25 AM

పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ మొదలైన దుమారం సద్దుమణగడం లేదు. పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌పై దుమారం
ఢిల్లీలో ధర్నా చేస్తున్న మాదిగ శక్తి నాయకులు

- మాదిగలకు ఇవ్వాలని నేతల డిమాండ్‌

- మాదిగ శక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ మొదలైన దుమారం సద్దుమణగడం లేదు. పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణ పేరును ప్రకటించింది. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు భగ్గుమంటున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన నాటినుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్‌కు మాత్రమే ఒకసారి టికెట్‌ ఇవ్వగా, మిగతా ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్లకే ఇస్తున్నారని, వాళ్లంతా స్థానికేతరులేనని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రశేఖర్‌ కు టికెట్‌ ఇవ్వగా గడ్డు పరిస్థితుల్లో కూడా పార్టీ మంచి ఓట్లు సాధించిందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలవడం గమనార్హం. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ గెలుపు సులభమేనని భావించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నాయకులు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈసారి ఎలాగైనా పార్టీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్‌ ఇస్తుందని అంతా ఆశించారు. కానీ మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్‌ తనయుడు వంశీకృష్ణకు టికెట్‌ ప్రకటించడంతో అంతా ఖంగుతిన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాజీ ఎంపీ డాక్టర్‌ సుగుణకుమారి, జాతీయ యువజన నాయకుడు ఊట్ల వరప్రసాద్‌, పార్టీ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్‌, గజ్జెల కాంతం, పెర్క శ్యామ్‌ తదితరులు టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న మూడు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ టికెట్‌ ఇస్తుందని భావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉండడంతో ఎలాగైనా పెద్దపల్లి టికెట్‌ను మాదిగలకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు మాదిగ ఐక్యవేదిక, మాదిగశక్తి ఆధ్వర్యంలో ఆ పార్టీకి వినతిపత్రాలు అందజేశారు. మాదిగలకే టికెట్‌ ఇవ్వాలంటూ జిల్లా కేంద్రంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దఎత్తున డప్పుల చాటింపు కార్యక్రమం కూడా నిర్వహించారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలకు వినతిపత్రాలు కూడా అందజేశారు. కానీ పార్టీ గడ్డం వంశీకృష్ణ వైఫై మొగ్గుచూపింది.

ఫ నేతల్లో అసంతృప్తి..

వివేక్‌ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న వంశీకృష్ణ మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న వివేక్‌ అనూహ్యంగా యూటర్న్‌ తీసుకొని తన కుమారుడితో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్‌ చెన్నూరు నుంచి, ఆయన సోదరుడు వినోద్‌ బెల్లంపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వడంతో మిగతా నేతలు గుర్రుమంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్‌ ఇవ్వడంపై తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వెంకటస్వామికి ఆరుసార్లు, ఆయన కుమారుడు వివేక్‌కు రెండుసార్లు టికెట్‌ ఇచ్చిన పార్టీ మళ్లీ అదే కుటుంబానికి చెందిన వివేక్‌ వారసుడు వంశీకృష్ణకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ పలువురు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి టికెట్‌ ఆశించిన యువజన జాతీయ నాయకుడు ఊట్ల వరప్రసాద్‌ ఇటీవల ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ జెండాలు మోస్తున్న వారిని కాదని, పలుసార్లు పార్టీలు మారి వచ్చిన ప్యారాచూట్‌ నేతలకు పార్టీ టికెట్‌ ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో గెలుపొందే సత్తా ఉన్న నాయకులే లేరా అని ఆయన ప్రశ్నించారు. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి రాజకీయ వారసులం తామేనని, వివేక్‌ తనయుడు కాదని ఆయన ఆక్రోషం వెళ్లగక్కారు. పార్టీ అభ్యర్థిని మార్చే విషయమై అధిష్ఠానం పునరాలోచన చేయాలని, లేదంటే వచ్చేనెల 5వ తేదీన పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిరసన దీక్ష చేపడతానని వరప్రసాద్‌ హెచ్చరించారు. మరోవైపు మాదిగ శక్తి ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వడంపై అసంతృప్తితో లోలోపల రగులుతున్నట్లు తెలుస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు, బీజేపీ నేతకాని సామాజిక వర్గానికి చెందిన గొమాసే శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే దారిలో నడిచినట్లు కనబడుతున్నది. అయితే ఈ వ్యవహారం మరింత రచ్చ గాకుండా ఉండేందుకు వివేక్‌ సోదరులు రంగంలోకి దిగి అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం.

Updated Date - Mar 29 , 2024 | 01:25 AM