Share News

‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి

ABN , Publish Date - May 26 , 2024 | 01:01 AM

గ్రామాల్లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్‌ చర్యలు చేపట్టింది.

‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి

- గ్రామాల్లో పట్టు సాధించేందుకు పార్టీల చర్యలు

- సర్పంచు, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

- స్థానికంగా బలోపేతంపై బీజేపీ ప్రణాళిక

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గ్రామాల్లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్‌ చర్యలు చేపట్టింది. రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ సానుకూల ఓటింగ్‌ పొందామని భావిస్తున్న భారతీయ జనతాపార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తుతోంది. కరీంనగర్‌ లోక్‌సభ స్థానాన్ని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని ధీమాతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నది. క్షేత్రస్థాయిలో పెరిగిన బలాన్ని నిలుపుకోవడానికి, రాజకీయంగా పట్టు బిగించడానికి గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలుగా పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటి సాధన కోసం పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వరి కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు మద్ధతు ధర, అలాగే బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. మండల, జిల్లా స్థాయిల్లో తహసీల్ధార్‌లకు, కలెక్టర్లకు రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించింది. వానాకాలం సాగు సందర్భంగా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందేలా చూడాలని అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తు న్నట్లు చెబుతున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యునిగా ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ గెలుపొందనున్నారని విశ్వసిస్తున్న పార్టీ నేతలు, శ్రేణులు ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతుందని అంచనా వేస్తున్నారు. సంజ య్‌ నాయకత్వంలో జిల్లాలో స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి ధీటైన పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల కమిటీలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత బలహీనపడిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన నైరాశ్యతను ఆ కారణంగా రానున్న రాజకీయ శూన్యతను వినియోగించుకుని స్థానిక సంస్థల్లో పట్టుబిగించాలని నేతలు బూత్‌ కమిటీలకు, శక్తి కేంద్రాల కమిటీలకు, మండల కమిటీలకు మార్గదర్శనం చేస్తున్నట్లు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఫలితాల తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ

కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌, వేములవాడ నియోజకవర్గాల్లో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రానున్నదని సిరిసిల్ల, హుస్నాబాద్‌, నియోజకవర్గాల్లో నువ్వానేనా అన్నట్లు ఓట్లు రానున్నాయని ఆ పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాలలో మండల స్థాయి కమిటీలను బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో విజయం సాధించేందుకు బండి సంజయ్‌కుమార్‌ ఇప్పటికే రెండు టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా సూచనలు ఇచ్చారని పార్లమెంట్‌ ఫలితాల తర్వాత నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పర్యటించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలను పార్టీ శ్రేణుల వద్దకు తీసుకవెళ్తారని చెబుతున్నారు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో దేశానికి నాయకత్వం వహించే నేత గురించి ఆలోచిస్తారని కేవలం నరేంద్రమోదీ పట్ల ఉన్న సానుకూలతతోనే ఓట్లు వేశారు తప్ప స్థానిక నాయకులను బీజేపీని ఎవరూ పట్టించుకోలేదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో స్థానిక నాయకత్వాన్ని పరిగనణలోకి తీసుకుంటారని ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకే ఉంటుంది తప్ప బీజేపీ పోటీలోనే ఉండదని వాఖ్యానిస్తున్నారు. వచ్చే నెలలో సర్పంచు ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్న తరుణంలో గ్రామీణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - May 26 , 2024 | 01:01 AM