Share News

‘ఉపాధి’ పెంపుపై దృష్టి

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:16 AM

ఉపాధిహామీ పనుల్లో మరింత వేగం పెంచడంపై అధికారులు దృష్టి సారించారు.

‘ఉపాధి’ పెంపుపై దృష్టి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉపాధిహామీ పనుల్లో మరింత వేగం పెంచడంపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధిహామీ పనులు జోరుగా సాగితేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో కూలీలకు ఎంత మొత్తంలో పనులు కల్పిస్తే అందులో 40 శాతం నిధులు మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద కేటాయించనున్నారు. ఆ నిధులతో గ్రామాల్లో నిత్యం ప్రజలకు ఉపయోగపడే శాశ్వత నిర్మాణ పనులను చేపట్టే అవకాశాలుంటాయి. జిల్లాలో ఈ ఏడాది జరుగుతున్న గ్రామీణ ఉపాధిహామీ పనుల్లో మరింత వేగం పెంచడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం ఈ ఏడాదికి 22 లక్షల 52 వేల పని దినాలు కేటాయించగా, ఇప్పటి వరకు 22 లక్షల 13వేల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఐదు మాసాల గడువు ఉంది. అప్పటివరకు నిర్దేశించిన లక్ష్యానికి మించి కూలీలకు పనులు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించి మొత్తం 30 లక్షల పనిదినాలను పూర్తిచేయాలని, తద్వారా సుమారు 45 కోట్ల రూపాయలకు పైగా మెటీరియల్‌ కంపోనెంట్‌ జనరేట్‌ అవుతుందని, వీటితో జిల్లాలో పెద్దఎత్తున శాశ్వత నిర్మాణ పనులు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో జిల్లాలో ఉన్న ఉపాధిహామీ కూలీలను ప్రోత్సహించి పనులు చేయించాలని ఆదేశించారు. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు కూలీలను ప్రోత్సహించే పనిలో నిమగ్నం అయ్యారు. గ్రామాల్లో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడాన్ని నివారించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం 2005-06 గ్రామీణ ఉపాధిహామీ పథకానికి చట్టబద్ధత కల్పించింది. జాబ్‌ కార్డులు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిల్లాలో లక్షా 19వేల జాబ్‌ కార్డులు..

జిల్లాలో లక్షా 19వేల జాబ్‌ కార్డులను జారీ చేయగా, వీటి ద్వారా 2లక్షల 44 వేల కూలీలు నమోదై ఉన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఏడాదికి సరిపడా పనులను గుర్తించి పనులు చేస్తారు. కూలీల కోసం చెరువుల్లో పూడికతీత, కట్టల అభివృద్ధి, కాలువల తవ్వకాలు, కాంటూర్‌ కందకాలు, సోక్‌ పిట్లు, ఇంకుడు గుంతల తవ్వకాలు, పొలాల వద్దకు ఫార్మేషన్‌ రోడ్లు, వన మహోత్సవం కోసం నర్సరీల్లో మొక్కలు పెంచడం, మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం వంటి పలు రకాల పనులు చేస్తుంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 22 లక్షల 52 వేల పనిదినాలను కూలీలకు కల్పించగా, ఇప్పటి వరకు 22 లక్షల 13 వేల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ పనులకు 59 కోట్ల 21 లక్షల రూపాయలు ఉపాధిహామీ పనుల కింద వెచ్చించారు. ఇందులో కూలీలు 50 కోట్ల 4 లక్షల రూపాయల విలువైన పనులు చేయగా, మెటీరియల్‌ కింద 5 కోట్ల 65 లక్షల 95 వేల రూపాయలు, మిగతా రూపాయలు, అడ్మినిస్ట్రేషన్‌ కింద ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 86 కోట్ల 49 లక్షల రూపాయల విలువైన పనులు జరగగా, 44 కోట్ల 82 లక్షల రూపాయలు కూలీల కోసం వెచ్చించగా, 36 కోట్ల రూపాయల విలువైన మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద పనులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పని దినాలు పూర్తిచేస్తే లేబర్‌ కంపొనెంట్‌ 75 కోట్ల వరకు చేరనున్నదని, తద్వారా 45 కోట్ల రూపాయలకు పైగా మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులు చేసుకునే అవకాశాలున్నాయి. మెటీరియల్‌ కంపొనెంట్‌ నిధులతో గ్రామాల్లో ఇప్పటి వరకు గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, రైతు వేదికల నిర్మాణాలు, మురికి కాలువలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు చేశారు. అలాగే సెగ్రిగేషన్‌ షెడ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్మాంచారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే నిధులే తప్ప ఇతరత్రా రావడం లేదు. ఎమ్మెల్యేలు సీడీఎఫ్‌ ద్వారా, డీఎంఎఫ్‌టీ ద్వారా పనులు చేపడుతున్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల వరకు శాశ్వత పనులకు వెచ్చిస్తున్నారు. ఉపాధిహామీ పనులకు పెద్దఎత్తున కూలీలు వచ్చే విధంగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాఽధిహామీ సిబ్బంది, మండల పరిషథ్‌ అధికారులు ప్రోత్సహిస్తే మెటీరియల్‌ కంపోనెంట్‌ బడ్జెట్‌ పెరిగే అవకాశాలున్నాయి.

Updated Date - Oct 25 , 2024 | 01:16 AM