Share News

రుణమాఫీపై అన్నదాతల హర్షం

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:08 AM

ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలోని రైతుల్లో అనందాన్ని నింపింది. జిల్లా వ్యాప్తంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.

రుణమాఫీపై అన్నదాతల హర్షం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలోని రైతుల్లో అనందాన్ని నింపింది. జిల్లా వ్యాప్తంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. రూ .2లక్షల లోపు పంట రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని ప్రకటించినట్లుగానే ప్రభుత్వం ఒకే విడతలో రూ.2 లక్షలు మాఫీ చేస్తూ మంత్రి వర్గం తీర్మాణం చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే బ్యాంక్‌ అధికారులు వివరాలను ప్రభుత్వానికి అందించారు.

జిల్లాలో 61,234 మంది రైతులకు లబ్ధి

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేయడాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రుణమాఫీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 61,234 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 702.36 కోట్ల వ్యవసాయ రుణాలను పొందారు. రుణమాఫీపై ఇప్పటికే బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి లెక్కలను అందించారు. త్వరలో మార్గదర్శకాలు వెలవడనున్నాయి. మార్గదర్శకాలపై మాత్రం రైతుల్లో ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు మాఫీకి అనర్హులనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. ఒక కుటుంబంలో ఐదుగురు పేరిట రూ. లక్ష రుణం పొందితే రూ.5 లక్షల వరకు రుణం అవుతుంది. కానీ రూ.2 లక్షల వరకే రుణ పరిమితి ఉంటుందని రేషన్‌ కార్డును కూడా అనుసంధానం చేయాల్సి ఉంటుందనే చర్చ సాగుతోంది. కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? లేదా? అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.

గత ప్రభుత్వ హయాంలో నాలుగు విడతలుగా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష లోపు రుణమాఫీ హామీ ఇచ్చి నాలుగు విడతలుగా మాఫీ ప్రక్రియ చేపట్టింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2018 డిసెప్టెంబరు 11వ తేదీ వరకు రుణం తీసుకున్న వారికి వర్తింప జేసింది. తొలి విడతలో రూ.25వేల లోపు ఉన్నవారికి, రెండో విడత రూ.50 వేల లోపు, మూడో విడత రూ.50 నుంచి లక్షలోపు ఉన్నవారికి మాఫీ చేసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదని, రైతుల వడ్డీకే సరిపోయిందనే విమర్శలు వచ్చాయి. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 61,773 మంది రైతులు లక్ష రుణమాఫీకి అర్హులుగా ప్రకటించి మాఫీ చేసింది.

Updated Date - Jun 24 , 2024 | 01:08 AM