Share News

రైతు బంధా..? రైతు భరోసానా..?

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:28 AM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తుందా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని అమలుచేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది.

రైతు బంధా..? రైతు భరోసానా..?

- కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందేనా..

- స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తుందా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని అమలుచేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో ఇప్పటికే జిల్లా రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యింది. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ముక్కోటి దేవుళ్ల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ రుణాలు మాఫీ అయ్యే వరకు బ్యాంకుల్లో, సహకార సంఘాల్లో పంట రుణాలు పొందే పరిస్థితి లేదు. ఈలోపు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని, అందులో రైతుభరోసా పథకం ఒకటి అని ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రైతులు, కౌలు రౌతులకు 15వేల రూపాయలు, రైతు కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గడిచిన యాసంగి సీజన్‌ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తుందని ఎదురుచూశారు. కానీ గత ప్రభుత్వం అమల్లో ఉన్న రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున ఇచ్చే సాయాన్ని మాత్రమే అందజేసింది. ఆ లెక్కన జిల్లాలో 1,48,775 మంది రైతులకు 136 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మూడు మాసాల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో కొత్త పథకాలను అమల్లోకి తీసుకవచ్చే పరిస్థితి లేదు. గురువారం నాటితో కోడ్‌ ముగిసింది. దీంతో రైతులు ప్రభుత్వం వంక చూస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద ఒక్కో ఎకరానికి 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి 10 వేలు ఇచ్చారు. పట్టా భూమి కలిగిన వారందరికీ పెట్టుబడి సాయాన్ని అందించడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్‌ నుంచే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుభరోసా పథకం కింద ఇవ్వాలని రైతులు, కౌలు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఈ సీజన్‌ నుంచే అమలుచేస్తారా, వచ్చే సీజన్‌ నుంచి అమలు చేస్తారా అనే విషయమై స్పష్టత లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం వలే గాకుండా విధివిధానాలను మార్చి రైతుభరోసా పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. పెట్టుబడి సాయం చేసే విషయమై సీలింగ్‌ విధించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు పథకం అమలు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించ లేదు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా మార్గదర్శకాలను రూపొందించి రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు.

ఫ రైతు భరోసాను అమలు చేయాలి

- బేరం కుమార్‌, కౌలు రైతు, ఓదెల

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ సీజన్‌ నుంచే అమలు చేయాలి. గతంలో ఎరువు బస్తాలకు సబ్సిడీ ఉండేది. కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రస్తుతం అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించడంతో సంతోషించాం.పట్టాదారులకు కౌలు ఇచ్చి, పెట్టుబడులు పెట్టి శ్రమించినా మాకు ఏమి మిగలడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఇచ్చి ఆదుకోవాలి.

ఫ రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలి

- దర్శనాల రాజనర్సు, కాల్వశ్రీరాంపూర్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. తనకున్న 2 ఎకరాలతో పాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాను. కౌలు చేయడం వల్ల ఒక్కోసారి ప్రకృతి సహకరించక పెట్టుబడులు కూడా దక్కడం లేదు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు ప్రతి ఏటా పెరుగుతుండడంతో తదనుగుణంగా పంటల ధరలు పెరగడం లేదు. వ్యవసాయం చేయాలంటేనే వెనక్కి తగ్గే పరిస్థితి. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతుభరోసా పథకం మాలో భరోసాను నింపింది. ఆ పథకాన్ని ఈ సీజన్‌ నుంచే అమలుచేసి రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలి.

ఫ కౌలు సేద్యం గిట్టుబాటు కావడంలేదు..

- మేకల రవి కౌలు రైతు, ఓదెల

ప్రతి ఏటా కౌలు ధరలు పెరుగుతున్నాయి. ఎకరం భూమికి రెండు సీజన్లకు కలిపి 20 నుంచి 22 వేల రూపాయలు పట్టాదారుకు చెల్లించాల్సి వస్తున్నది. కౌలుతో పాటు పెట్టుబడులు పెట్టి పంటలు పండించడం వల్ల పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు ఏమి వర్తించవు. బ్యాంకుల్లో కనీసం రుణాలు ఇచ్చే వాళ్లు ఉండరు. అప్పులు చేసి పెట్టుబడులు తీసుకరావాలి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుభరోసా పథకం ద్వారా ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు సీజన్లకు కలిపి 15 వేలు ఈ సీజన్‌ నుంచే ఇచ్చి కౌలు రైతులకు ఆదుకోవాలి.

Updated Date - Jun 08 , 2024 | 01:28 AM