Share News

వేతనాల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:29 AM

కేజీవీబీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు.

వేతనాల కోసం ఎదురుచూపులు

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 4: కేజీవీబీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. ఉమ్మడి జిల్లాలో 52 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), నాలుగు అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎస్‌) ఉన్నాయి. వీటిలో 1,300 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు విధానంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పనిచేస్తున్నారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని ఎత్తివేసి అర్హులైన వారందరిని రెగ్యులరైజ్‌ చేసి ప్రభుత్వ వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు.

అరకొర వేతనాలు

చాలీచాలని వేతనాలతో కేజీవీబీ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వోపాధ్యాయులకు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్న వీరిలో స్పెషల్‌ ఆఫీసర్లకు 32,500, పీజీ సీఆర్‌టీ 29,900, కాంట్రాక్టు రెసిడెన్స్‌ టీచర్స్‌కు 26,000 రూపాయల వేతనం చెల్లిస్తున్నారు. వీరితోపాటు కేజీబీవీల్లో అకౌంటెంట్‌, ఏఎన్‌ఎం, పీఈటీ, వొకేషనల్‌ టీచర్లు, ఇతర సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎస్‌)లో సౌకర్యాల లేమితో కూడిన తరగతి గదుల్లో విద్యాబోధన చేయడం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా తమను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో ఇన్నాళ్లుగా పని చేస్తున్నామని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ ప్రధానమైన డిమాండ్లు పోస్టులను రెగ్యులరైజ్‌ చేయడం, హెల్త్‌కార్డులు జారీ చేయడం వంటి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని చెబుతున్నారు. వరుసగా రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ రెండు నెలల వేతనాలు ఇవ్వాలని, ఇకపై ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి: యూటీఎఫ్‌

కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వెంటనే రెండు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని టిఎస్‌యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.కుమార్‌, జావీద్‌, కోశాధికారి రాజమౌళి డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపామని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Updated Date - Jan 05 , 2024 | 12:29 AM