Share News

హోం ఓటింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 03 , 2024 | 12:35 AM

హోం ఓటింగ్‌కు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు.

హోం ఓటింగ్‌కు సర్వం సిద్ధం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

హోం ఓటింగ్‌కు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ‘హోం ఓటింగ్‌’ సౌకర్యాన్ని కల్పించారు. హోం ఓటింగ్‌ పద్ధతిని తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో ప్రవేశ పెట్టారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ అవకాశం కల్పించారు. ఈ నెల 13న పోలింగ్‌ ఉన్నా ముందస్తుగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 3వ తేదీ నుంచి 5 తేదీ వరకు హోం ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, వీడియో గ్రాఫర్‌, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చి ఒక బృందంగా ఏర్పాటు చేశారు. వీరు వృద్ధులు, దివ్యాంగులైన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్తారు. ఇంట్లోనే కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేస్తారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఓటు హక్కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించి పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో హోం ఓటింగ్‌ కోసం 744 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరికోసం 19 బృందాలు మూడు రోజులపాటు హోం ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నాయి.

పారదర్శకంగా లోక్‌ సభ ఎన్నికలు

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, మే 2 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ అన్నారు. గురువారం ఢిల్లీ నుంచి ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితేష్‌ వ్యాస్‌ మాట్లాడుతూ అందరినీ సమానంగా చూడాలని, ఎవరి పట్ల పక్షపాతంతో వ్యవహరించవద్దని అన్నారు. ఎన్నికల విధులు భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా జరగాలని, ఏ చిన్న పొరపాటు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్‌ యూనిట్లు చేరుకున్నాయని, ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్ల ఎఫ్‌ఎల్‌సీ, ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం మే 8 నాటికి పూర్తి చేయాలని అన్నారు. హోమ్‌ ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే 100 శాతం ఓటర్‌ సమాచార స్లిప్పులు ప్రతీ ఒక్క ఓటర్‌కు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ ఓటర్లకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ కేంద్రం వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన ఆహారం, బాత్‌ రూం, ఇతర వసతులు కల్పించాలన్నారు. సకాలంలో పోలింగ్‌ ప్రారంభం కావాలని, పోలింగ్‌ కంటే ముందు మాక్‌ పోల్‌ నిర్వహించాలని అన్నారు. పోలింగ్‌ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలన్నారు. సెక్టార్‌ అధికారులు పోలింగ్‌ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారని, ఈవీఎం యంత్రాలు పనిచేయని పక్షంలో నూతన ఈవీఎం యంత్రం ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై సెక్టర్‌ అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందజేయాలని తెలిపారు. పోలింగ్‌ రోజున జిల్లా కేంద్రాలలో నిపుణులైన అధికారులతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్‌ దగ్గరవుతున్న సమయంలో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూడాలన్నారు. సీ విజిల్‌ యాప్‌ వినియోగ పై ప్రచారం చేయాలన్నారు. పోలింగ్‌ సమయాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్పులు చేసిందని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఈ అంశం పై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచార ప్రక్రియ ఆగిపోతుందని, సైలెన్స్‌ పీరియడ్‌లో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించాలన్నారు.

జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీ

జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 20 వేల 347 మంది ఓటర్లకు ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేశామని హోం ఓటింగ్‌లో 244 మంది పాల్గొన్నారని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 277 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌, 197 పోలింగ్‌ కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే 2457 సిబ్బంది కోసం వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నూతన గ్రంథాలయ భవనం (తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ) సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల గీతానగర్‌లో ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను, పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేశామన్నారు. 744 మంది హోం ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, మే 3 నుంచి మే 5 వరకు హోం ఓటింగ్‌ పూర్తి చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్‌, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:35 AM