Share News

అంతా కల్తీ

ABN , Publish Date - May 27 , 2024 | 12:17 AM

జిల్లా వ్యాప్తంగా కల్తీ వస్తువులు అమ్ముతూ వ్యాపారులు, హోటళ్ల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కరీంనగర్‌లో హోటళ్లు, రెస్టా

 అంతా కల్తీ

కరీంనగర్‌ క్రైం, మే 26: జిల్లా వ్యాప్తంగా కల్తీ వస్తువులు అమ్ముతూ వ్యాపారులు, హోటళ్ల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కరీంనగర్‌లో హోటళ్లు, రెస్టారెంట్‌లతో పాటు నిత్యవసర సరుకులను కల్తీ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించి కల్తీ వస్తువులు, కుళ్లిపోయిన ఆహారపదార్థాలు పట్టుకున్నారు. తాగునీరు నుంచి ప్రారంభమైన ఈ కల్తీ ప్రజలు ప్రతి రోజు వినియోగించే పాలు, వంట నూనె, పప్పులు, పిండి, ఇతర ఆహారపదార్థాలకు పాకింది. ఔషధాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్‌, మద్యం వంటి అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి. ఆహార పదార్థాలు, వస్తువులు, పప్పుదినుసులు కొనుగోలు సమయంలో అసలు ఏదో... నకిలీ ఏదో తేల్చుకోలేని పరిస్థితిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ఫ ఆహారభద్రతా శాఖలో సిబ్బంది కొరత....

కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ వస్తువుల విక్రయాలను నియంత్రించటానికి ఏర్పాటు చేసిన ఆహారభద్రతా శాఖలో ఖాళీలను దీర్ఘకాలంగా భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ కల్తీ దందా జిల్లాలో ఒక మాఫియాగా తయారైంది. జిల్లాలో ఒక్క ఇన్‌చార్జి గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉన్నారు. ఆ ఒక్కరితో జిల్లా అంతటా తనిఖీలు ఏ విధంగా సాద్యమవుతాయో అధికారులకే తెలియాలి. కరీంనగర్‌లో ఫుడ్‌ సేఫ్టీ ఆపీస్‌లో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ మినహా మిగతా అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నాలుగేళ్లుగా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా ఇతర జిల్లాకు చెందిన వారే ఇన్‌చార్జిగా ఉంటున్నారు. కరీంనగర్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీస్‌లో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌-1, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌-2, జూనియర్‌ అసిస్టెంట్‌-1, క్లర్క్‌-1, అటెండర్లు-2 పోస్టులుండాలి. కామారెడ్డి ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ సునీత కరీంనగర్‌కు ఇన్‌చార్జిగా ఉంటూ అప్పడప్పుడు వచ్చిపోతుంటారు.

Updated Date - May 27 , 2024 | 12:17 AM