ముగిసిన ‘కోడ్’
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:35 AM
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అడ్డుగా మారిన పార్లమెంట్ ఎన్నికల కోడ్ గురువారం నాటితో ముగిసింది. మూడు మాసాలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, ఇప్పటివరకు అమలవుతున్న పథకాలకు సంబంధించిన చేర్పులు, మార్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

- సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల నిరీక్షణ
- ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అందక ఇక్కట్లు
- ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు
- అభివృద్ధి పనుల్లో వేగం పెరిగేనా?
- రైతు బంధు ఇస్తారా లేక రైతు భరోసానా?
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అడ్డుగా మారిన పార్లమెంట్ ఎన్నికల కోడ్ గురువారం నాటితో ముగిసింది. మూడు మాసాలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, ఇప్పటివరకు అమలవుతున్న పథకాలకు సంబంధించిన చేర్పులు, మార్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కోడ్ ముగియడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఆశలు పెట్టుకున్న ప్రజలు అవి ఏ మేరకు తమకు దక్కుతాయోనని ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 8వ తేదీన విడుదల చేసింది. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వపరంగా కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడానికి, కొత్తగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకరావడానికి అవకాశం లేకుండాపోయింది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో నిర్వహించారు. ఈనెల నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. గురువారం సాయంత్రం ఎన్నికల కోడ్ ముగిసింది. ఈనెల ఏడవ తేదీ నుంచి ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబరు 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలుపై దృష్టి సారించింది. 9వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకు అందిస్తున్న ఉచిత వైద్యాన్ని 10 లక్షల రూపాయలకు పెంచగా, ఆ పథకాన్ని కూడా అదే రోజు నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత మార్చి మొదటి వారంలో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించే పథకంతో పాటు, 500రూపాయలకే సబ్సిడీ గ్యాస్ అందించే పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు జిల్లాకు చెందిన మహిళలు 88.56 లక్షల టికెట్లపై ప్రయాణించారు. గృహలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 1,10,346 విద్యుత్ కనెక్షన్లు గల కుటుంబాలకు ఇప్పటివరకు 7 కోట్ల 68 లక్షల రూపాయల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. అలాగే సబ్సిడీ వంట గ్యాస్‌కు సంబంధించి 96,500 కుటుంబాలకు చెందిన వారికి సబ్సిడీని అందజేస్తున్నారు.
ఫ వారం రోజుల్లోనే కోడ్ అమలు..
అయితే ఈ రెండు పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన వారం రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉచిత విద్యుత్ అమలుకు నోచుకోని కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ఒక ఇంట్లో రెండు మీటర్లు ఉంటే రెండు మీటర్ల నంబర్‌లను దరఖాస్తులో పేర్కొనడంతో విద్యుత్ సిబ్బంది యాప్‌లో రెండింటిని నమోదు చేశారు. ఆయా మీటర్లలో ఏదైతే తక్కువ బిల్లు వస్తుందో దానికి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేశారు. అంతకంటే కాస్త ఎక్కువ బిల్లు వచ్చే మీటర్‌కు ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు ఎడిట్ ఆప్షన్ కోడ్ వల్ల ఇవ్వలేదు. అలాగే చాలామందికి సబ్సిడీ గ్యాస్ ఇప్పటివరకు పడడం లేదు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి చెక్ చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. వీటిని పరిష్కరించుకునేందుకు ఎన్నికల కోడ్‌ను ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన విధంగా రైతుబంధు ద్వారా యాసంగి సాగుకు 1,48,775 మంది రైతులకు సుమారు 132 కోట్ల సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. వానకాలం సీజన్ ప్రారంభమైనందున రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7500, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏడాదికి 12000 చొప్పున అందజేస్తుందా, లేక పాత పథకాన్ని కొనసాగిస్తుందో తెలియడం లేదు. ఎన్నికల కోడ్ వల్ల ఈ పథకం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ప్రకటన చేయలేదు. అలాగే మార్చి నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి భద్రాచలంలో నిర్వహించిన సభ ద్వారా ఆరంభించారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ అవి కొందరికి మాత్రమే అందాయి. చాలా చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ పథకం ఫెయిల్ కావడంతో అనేక మంది పేదలు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఐదు లక్షల ఇస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను అనుసరించి ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల ద్వారా ప్రతిపాదనలను పంపగా అవి ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇవేగాకుండా వివిధ గ్రాంట్ల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కోడ్ ముగియడంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.