హుజూరాబాద్ పీవీ జిల్లా ఏర్పాటుకు కృషి
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:28 AM
హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హుజూరాబాద్‌లో పీవీ జిల్లా సాధన సదస్సు ఆదివారం జరిగింది.
హుజూరాబాద్, జనవరి 28: హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హుజూరాబాద్‌లో పీవీ జిల్లా సాధన సదస్సు ఆదివారం జరిగింది. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ జిల్లా కోసం ఈ ప్రాంత ప్రజలు ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందన్నారు. పీవీ అంటే భూసంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడన్నారు. ఆయన పేరిట జిల్లా ఏర్పాటు చేయడం తప్పేమీ లేదన్నారు. పీవీ జిల్లా ఏర్పాటు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు, జీవన, ఆర్థిక, భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఉద్యమకారుడిగా తనను గుర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని, ఇది తనకు కొత్త బాధ్యత అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘాలను చీల్చి ఘర్షణ వాతావరణం నెలకొల్పిందన్నారు. బీఆర్‌ఎస్ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామిక పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. డబ్బులతో ఏమైనా చేయవచ్చనే అహంభావం బీఆర్‌ఎస్ నాయకుల్లో ఉందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామన్నారు. టీజేఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సహకరిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, ఆవునూరి సమ్మయ్య, భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం, రవీందర్‌రావు, పత్తి కృష్ణారెడ్డి, పి ఈశ్వర్‌రెడ్డి, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, అర్కిళ్ల స్రవంతి, మోరె గణేష్, సతీష్‌యాదవ్, రవీందర్, శివదయాల్‌సింగ్ పాల్గొన్నారు.