అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌లో శిక్షణ
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:31 AM
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్న టైడ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థ ప్రిన్సిపాల్ బూవ రాఘవన్, జిల్లా రవాణాశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు.

సిరిసిల్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్న టైడ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థ ప్రిన్సిపాల్ బూవ రాఘవన్, జిల్లా రవాణాశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు. గురువారం అంతర్జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా తెలంగాణలో అతి పెద్ద తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్)లో అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, రహదారి భద్రతపై సదస్సు నిర్వహించారు. జిల్లాలోని పాత్రికేయ బృందం ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాఘవన్, కొండల్‌రావు మాట్లాడుతూ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో మెకానికల్ నాలెడ్జ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఏటా 4.50 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో 1.50 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఇందులో యువతనే ఎక్కువగా ఉంటున్నారన్నారు. రోడ్దు భద్రతపై అవగాహన లేకపోవడం సరైన శిక్షణ లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండెపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అశోక్ లేలాండ్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.22 కోట్లతో శిక్షణ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐదెకరాల్లో పరిపాలన, వసతి గృహ భవనాలు, 15 ఎకరాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించినట్లు వివరించారు. శిక్షణ కాలపరిమితిలో 21 రోజుల కోర్సుకు రూ.7,080, 30 రోజుల కోర్సుకు రూ.16,520, మూడు రోజుల కోర్సుకు రూ.2250, ఒక రోజు కోర్సుకు రూ .750 చొప్పున ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ కోర్సుల్లో 4 వేల మంది అభ్యర్థులు శిక్షణ పొందారని, 350 మందికి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు.