Share News

స్వశక్తి సంఘాలకు నిరాశ

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:05 AM

స్వశక్తి సంఘాల బలోపేతానికి దోహదపడే రుణాల మాట ఎలా ఉన్నా వడ్డీకోసం మహిళలు ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ కోసం నాలుగేళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. తర్వాత కొత్త ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని స్వశక్తి సంఘాల మహిళలు ఆశగా ఎదురు చూశారు.

  స్వశక్తి సంఘాలకు నిరాశ

- కంటి తుడుపుగా వడ్డీ విడుదల

- కొత్త సర్కారు బకాయిలే..

- పాత బకాయిలపై అయోమయం

- నాలుగేళ్లుగా ఎదురుచూపులు

- వడ్డీ రాయితీకి నిరీక్షణ తప్పదా?

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వశక్తి సంఘాల బలోపేతానికి దోహదపడే రుణాల మాట ఎలా ఉన్నా వడ్డీకోసం మహిళలు ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ కోసం నాలుగేళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. తర్వాత కొత్త ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని స్వశక్తి సంఘాల మహిళలు ఆశగా ఎదురు చూశారు. కొత్త ప్రభుత్వం కూడా మహిళా సంఘాలకు రుణాలు, వడ్డీ విడుదలపై ఆశలు కల్పించి నిరాశేపర్చింది. కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నుంచి మార్చి వరకు ఉన్న బకాయిలను మాత్రమే విడుదల చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7802 మహిళా సంఘాలకు రూ.7.39 కోట్లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన మేసేజ్‌లు ముఖ్యమంత్రి పేరిట మహిళా సంఘాలకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వడ్డీలేని రుణాల పథకం కింద డిసెంబరు నుంచి మార్చి వరకు పొదుపు ఖాతాల్లో జమ చేశామని మేసేజ్‌లు వచ్చాయి. పాత బకాయిల సంగతి ఏమిటో అర్థం కాక మహిళా సంఘాలు అయోమయానికి గురవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కూడా కంటి తుడుపుగా పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో వడ్డీ రాయితీ విడుదల చేయడం మహిళా సంఘాలకు నిరాశే మిగిల్చింది.

పాత బకాయిలు రూ.68.66 కోట్లు

మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలు బాటలు వేసినా ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీరాయితీ కోసం సభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు వడ్డీరాయితీ విడుదల కాక నాలుగేళ్లు గడిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న క్రమంలో కొత్త ప్రభుత్వం డిసెంబరు నుంచి మార్చి వరకు మాత్రమే బకాయిలు విడుదల చేసింది. పాత బకాయిల జోలికి వెళ్లకపోవడంతో నిరీక్షణ తప్పదా? అని మహిళ సంఘాలు భావిస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2020-21 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ రాయితీ బకాయి రూ.68.66 కోట్లకు చేరుకుంది. జిల్లాలో 9963 స్వశక్తి సంఘాలు, 411 గ్రామ సంఘాలు, 12 మండల సంఘాలు, వీటికి అనుసంధానంగా జిల్లా సమాఖ్య కూడా పని చేస్తోంది. స్వశక్తి సంఘాల పరిధిలో 1,12,637 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రతీ సంవత్సరం కోట్లలో వడ్డీలేని రుణాలను అందిస్తూ జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ముందజలో నిలుస్తోంది. స్వశక్తి సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ అందించడంలో ఇబ్బందులు లేకపోయినా వడ్డీ రాయితీ మాత్రమే భారంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం మినహాయించి 9755 స్వశక్తి సంఘాలకు రూ.68.66 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో 9051 సంఘాలకు రూ 20.67 కోట్లు, రాయితీ రావాల్సి ఉండగా 2021- 22లో 9001 సంఘాలకు రూ 25.78 కోట్లు, 2022- 23 సంవత్సరంలో 9755 సంఘాలకు రూ 22.21 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రాయితీ దాదాపు రూ.25 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 2014-15నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 9070 సంఘాలకు రూ.41.85 కోట్ల వడ్డీ రాయితీని సంఘాల ఖాతాల్లో జమ చేసింది.

ఫిబ్రవరి వరకు రూ.390.01 కోట్లు బ్యాంక్‌ లింకేజీ

జిల్లాలో బ్యాంక్‌ లింకేజీ ద్వారా 2023- 24 ఆర్థిక సంవత్సర లక్ష్యం 7630 సంఘాలకు రూ.443.11 కోట్లు రుణాలు అందించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిబ్రవరి వరకు 3570 సంఘాలకు రూ.390.01 కోట్లు అందించారు. స్త్రీనిధి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.63.09 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.32.43 కోట్లు అందించారు. స్త్రీనిధి రుణాల కింద ప్రభుత్వం రూ.12.25 కోట్లు వడ్డీరాయితీని స్వశక్తి సంఘాల ఖాతాల్లో జమ చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 01:05 AM