Share News

కలెక్టరేట్‌ ఎదుట ట్రక్‌ డ్రైవర్ల ధర్నా

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:54 PM

మోదీ హటావో..డ్రైవర్స్‌ బచావో అని ట్రక్‌ డ్రైవర్లు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్‌-అండ్‌-రన్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

కలెక్టరేట్‌ ఎదుట ట్రక్‌ డ్రైవర్ల ధర్నా

సుభాష్‌నగర్‌, జనవరి 12: మోదీ హటావో..డ్రైవర్స్‌ బచావో అని ట్రక్‌ డ్రైవర్లు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్‌-అండ్‌-రన్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌ మాట్లాడు తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టంలో సెక్షన్‌ 106(1)(2) ప్రకారం డ్రైవర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఏడు లక్షల జరిమానా విధించారని అన్నారు. ఈ చట్టాన్ని 2023లో డిసెంబరు 21న పార్లమెంట్‌లో సవివరమైన చర్చ జరగకుండా చేసి ఆమోదింపచేశారని ఆరోపించారు. డిసెంబరు 25న ఆ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పాతచట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం డైవర్లకు ఉరితాడులా మారిందన్నారు. ఈ విషయాన్ని గమనించి, సీఐటీయూ ఇతర రవాణారంగ ఫెడరేషన్లతో కలిసి ఈ నెల 17 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించడం వల్లే చట్టం రద్దు అవుతుందన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ట ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రముఖ ప్రొఫెసర్‌ గీతం తివారి అధ్యయనం ప్రకారం 90 శాతం రోడ్డు ప్రమాదాలు మానవేతర కారాణాలతో జరుగుతున్నాయని ఢిల్లీ ఐఐటీ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. కాంట్రాక్టర్లు నిబంధనలు విరుద్దంగా రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ గంణాకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న రోడ్డులో జాతీయ రహరాదులు ఉన్నవి కేవలం రెండు శాతం మాత్రమేనని, 62 శాతం రోడ్డు ప్రమాదాల్లో నిర్మాణం లోపం వల్లే జరుగుతున్నారని ఆరోపించారు. నేషనల్‌ పర్మిట్‌ ఉన్న వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిభందనల తొలగించారని ఆరోరించారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి మాట్లాడుతూ 2019 మోటారు వాహనచట్టంలో భారీగా పెంచిన జరిమానాల వల్ల ప్రమాదాలు తగ్గలేదు సరికదా ప్రమాదాలు పెరిగాయన్నారు. ప్రమాదాలకు కారణాలు పరిశీలించకుండా శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని అనడం సరికాదన్నారు. ప్రమాదం జరిగిపుడు గుడ్డిగా డ్రైవర్‌ను బాధ్యుడిని చేస్తూ చార్జిషీటు దాఖలవుతుందన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 106(1)(2) రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో లారీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె ఆరిఫ్‌మహియోద్దీన్‌, ఇసుక టిప్పర్‌ డ్రైవర్లు, యూనియన్‌ నాయకులు శివ, శ్రీను, రెడీమెడ్‌ కాంక్రీట్‌ వాహన డ్రైవర్స్‌ నాయకులు రాంచంద్రన్‌, శ్రీనివాసచారి, దస్తగిరి, ఎండి షఫి, పవన్‌, మహేందర్‌, వెంకన్న, భద్రయ్య, సరేందర్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:54 PM