Share News

వికసిత్‌ భారతే లక్ష్యం..

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:48 AM

పదేళ్ల ప్రగతిని చెప్పుకుంటూనే వికసిత్‌ భారత్‌ ఆవిష్కరించే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వికసిత్‌ భారతే లక్ష్యం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పదేళ్ల ప్రగతిని చెప్పుకుంటూనే వికసిత్‌ భారత్‌ ఆవిష్కరించే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల తాయిలాలు లేకుండా, ఆదాయ పన్నుల మినహాయింపులు లేకపోవడంపై వేతన జీవులు నిరాశ చెందారు. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 47 లక్షల 65 వేల 768 కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చిలో గానీ, ఏప్రిల్‌లో గానీ పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తుందని జిల్లా ప్రజలు భావించారు. కానీ అలాంటివేమి బడ్జెట్‌లో కనబడలేదు. ఎలాంటి చమక్కులు లేకుండానే బడ్జెట్‌ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 94 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రతిపాదనలో ఉన్న బసంత్‌నగర్‌ ఎయిర్‌పోర్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. వ్యవసాయపరంగా ఇప్పటి వరకు రైతులకు నానో యూరియా అందిస్తున్న విధంగానే నానో డీఏపీ కూడా అందిస్తామని ప్రకటించారు. ఉపాధిహామీ పథకానికి గతంలో కంటే బడ్జెట్‌ పెంచడం గమనార్హం. 85వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే ఆవాస్‌ యోజన పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేయనున్నారు. పీఎం స్వనిధి పథకం కింద మరో 2.3లక్షల మంది చిరువ్యాపారులకు రుణాలు అందజేస్తామని చెప్పడం వీధి వ్యాపారులకు ఊరట కలిగించనున్నది. రైల్వేకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపుల్లో నిరాశకు గురిచేశాయి. రామగుండం నుంచి మణుగూర్‌ లైన్‌కు 5 కోట్లు మాత్రమే కేటాయించారు. కాజీపేట నుంచి బల్లార్షా మూడవ విద్యుత్‌ లైన్‌ మార్గానికి 350 కోట్లు కేటాయించారు. రైల్వేస్టేషన్లలో సదుపాయాల దృష్ట్యా పెద్దపల్లి జంక్షన్‌ స్టేషన్‌లో లిఫ్ట్‌, ఎస్క్‌లేటర్‌ ప్రస్తావన లేకపోవడంతో ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. బడ్జెట్‌పై వివిధ పార్టీలకు చెందిన నాయకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

వికసిత్‌ భారత్‌ దిశగా బడ్జెట్‌

- ఎస్‌ కుమార్‌, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి

వికసిత్‌ సంకల్ప్‌ భారత్‌ దిశగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఉంది. 2047 నాటికి భారత్‌ వందేళ్లు పూర్తి చేసుకోనున్నందున అప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను చేర్చడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారు. యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా గొప్పలకు వెళ్లకుండా ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ ఉంది. భారత్‌ దేశ పురోభివృద్ధి దిశగానే బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇది అందరు మెచ్చే బడ్జెట్‌.

అన్ని వర్గాలకు ఊతమిచ్చే బడ్జెట్‌..

- జాడి బాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మెర్చా అధికార ప్రతినిధి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు ఊతమిచ్చే విధంగా ఉంది. రైతులు, మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. రైతులకు ఇప్పటివరకు అందిస్తున్న నానో యూరియాతో పాటు నానో డీఏపీ సరపరా చేయనున్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం మధ్యతరగతి ప్రజలకు కూడా సద్వినియోగం కానున్నది. రెండు మాసాల్లో ఎన్నికలు ఉన్నా కూడా తాయిలాలకు వెళ్లకుండా అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ ఉంది.

సర్వీస్‌ సెక్టార్లు, ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం కరువు

- దాసరి ఉష, బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి

భారత దేశం ఉత్పత్తి రంగం, సర్వీస్‌ సెక్టార్‌లో ప్రసిద్ధి చెందింది. వారిని ప్రోత్సహించే విధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులు కష్టాల్లో ఉన్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించలేదు. చేనేత రంగాన్ని కాపాడేందుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల ఆ రంగానికి చెందిన వాళ్లు బాగుపడే అవకాశాలు కనబడడం లేదు. పేదరికాన్ని నిర్మూలించే విధంగా బడ్జెట్‌ లేకపోవడం బాధాకరం.

సామాన్యులకు ఒరిగేదేమి లేదు..

- తాండ్ర సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సామాన్యులకు ఒరిగేదేమి లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేవిధంగా ఉన్నది. దేశంలో అసంఘటిత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్లోబల్‌ స్కీం పేరుతో దేశవ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యింది. జీఎస్టీ పెంపుతో మధ్య తరుగతి కుటుంబాల పరిస్థితి అధోగతి పాలు కానున్నది.

అంతా డొల్లగా ఉంది..

- ఊట్ల వరప్రసాద్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ డొల్లగా ఉంది. ఇప్పటికే 18 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. 2047 నాటికి వందేళ్ల భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపించడం లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలు కనిపించడం లేదు. వికసిత్‌ భారత్‌ అని చెప్పుకునే బీజేపీ చేస్తున్న ఆర్భాటం తప్ప, ఆచరణ కనిపించడం లేదు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల తగ్గింపు ప్రస్తావన లేకపోవడం, ఆదాయ పన్ను మినహాయింపు లేకపోవడం నిరాశ పరిచింది.

నిరాశపరిచిన బడ్జెట్‌..

- నల్ల మనోహర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచింది. అంకెల గారడి తప్ప అభివృద్ధి, సంక్షేమం కనబడడం లేదు. భారత్‌ వ్యవసాయ దేశం కావడంతో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకించి రైతులకు ప్రకటించిన తాయిలాలు ఏమి లేవు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే అంశాలు లేకపోవడం గమనార్హం. రైల్వే పరంగా కొత్త లైన్ల ఊసు లేదు. వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపులు లేవు. అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా లేదు.

విద్యా రంగానికి పెద్దపీట వేయలేదు..

- ఆకుల వివేక్‌స్వామి పటేల్‌, బీసీ సంఘం నాయకుడు

కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్ద పీట వేయక పోవడం విచారకరం. ఆదాయ పన్నును 8 లక్షల వరకు మినహాయింపు ఇస్తారని అంతా భావించారు. కానీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వక పోవడం నిరాశ కలిగించింది. బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై బడ్జెట్‌ కేటాయింపులు లేవు. రైతులను ఆదుకునే చర్యలు లేకపోగా, ఆటోమోబైల్‌ రంగాన్ని విస్మరించారు. బడ్జెట్‌లో కొత్తదనం లేకపోగా, ప్రజలను ఆకట్టుకునే విధంగా లేకపోవడం విచారకరం.

నిరాశపరిచిన రైల్వే కేటాయింపులు..

- ఫణి శర్మ, సామాజిక కార్యకర్త

కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు నిరాశ పరిచాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామగుండం- మణుగూర్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి క్లియరెన్స్‌ ఇచ్చే విధంగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని భావించాం. కానీ కేవలం 5 కోట్లు మాత్రమే కేటాయించారు. పెద్దపల్లి జంక్షన్‌ వద్ద కాజీపేట, నిజామాబాద్‌ లైన్‌ బైపాస్‌ లైన్‌ నిర్మాణం కోసం వెయ్యి రూపాయలే కేటాయించడం విచారకరం. కొత్తగా వందే భారత్‌ రైళ్లను పెద్దపల్లి మార్గంగుండా వేస్తారని ఆశించాం. కానీ నిరాశే ఎదురయ్యింది. రైల్వే కేటాయింపులు ఆశాజనకంగా లేవు.

Updated Date - Feb 02 , 2024 | 12:48 AM