Share News

ముదురుతున్న వర్గపోరు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:51 AM

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత కాలంగా బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. నియోజకవర్గానికి చెందిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు.

ముదురుతున్న వర్గపోరు

- బీజేపీ నేతల మధ్య కొరవడిన సమన్వయం

- మండల కమిటీల నియామకంపై గుర్రు

- ఏకపక్షంగానే వేశారంటూ ఆరోపణలు

- పెద్దపల్లిలో వేర్వేరుగా రైతు సత్యాగ్రహ దీక్షలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత కాలంగా బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. నియోజకవర్గానికి చెందిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం కాకపోవడమే కాకుండా రానున్న పార్లమెంట్‌ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల అధ్యక్షుల నియామకాలపై ఒక వర్గానికి చెందిన నాయకులు గుర్రుమంటున్నారు. జిల్లా అధ్యక్షుడు ఏకపక్షంగా మండల, పట్టణ అధ్యక్షులను నియమించారని, పార్టీలో ఉన్న నాయకులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా అధ్యక్షులను జిల్లా అధ్యక్షుడు నియమించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన వారికే పదవులు అంటగట్టడంపై మండిపడుతున్నారు. మూడు మాసాల క్రితం కూడా పాత అధ్యక్షుడు రావుల రాజేందర్‌ జిల్లా కమిటీలో అందరిని సంప్రదించకుండానే నియమించడంపై పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కమిటీని రాష్ట్ర కమిటీ రద్దు చేసింది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా బీజేపీకి చెందిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరును సాగిస్తున్నారు. వీరి పోరు వల్ల సామాన్య పార్టీ కార్యకర్తలు నలిగిపోవడమే గాకుండా పార్టీ బలోపేతం కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఒక వర్గంగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ మరో వర్గంగా ఏర్పడ్డారు. ఇరువర్గాలు ఒకరినొకరు కలుసుకోకపోవడమే గాకుండా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మూడు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు ఇవ్వగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయన ప్రచారం చేయలేదని, పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. 1999లో ఎన్‌డీఏ పొత్తులో భాగంగా పెద్దపల్లి స్థానాన్ని అప్పటి టీడీపీ బీజేపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2018లో పెద్దపల్లి నుంచి, 2014లో రామగుండం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు కూడా ఆయన పార్టీ నాయకులందరినీ కలుపుకుని వెళ్లలేదనే విమర్శలు వచ్చాయి. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌లను సమన్వయం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడ లేదు. దీంతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ పరంగా తీరని నష్టం వాటిల్లుతున్నదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

- భగ్గుమంటున్న గుజ్జుల వర్గీయులు..

ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చంద్రుపట్ల సునీల్‌రెడ్డి గురువారం ప్రకటించిన పట్టణ, మండల అధ్యక్షుల జాబితాను చూసి గుజ్జుల వర్గీయులు భగ్గుమంటున్నారు. దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ సూచనల మేరకు ఆయన వర్గానికి చెందిన పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడిగా కావేటి రాజగోపాల్‌, పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా మేకల శ్రీనివాస్‌, సుల్తానాబాద్‌ పట్టణ అధ్యక్షుడిగా కూకట్ల నాగరాజు, మండల అధ్యక్షుడిగా వేల్పుల రాజన్న, ఓదెల మండల అధ్యక్షుడిగా కారెంగుల శ్రీనివాస్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండల అధ్యక్షుడిగా చిలువేరు సంపత్‌, ఎలిగేడు మండల అధ్యక్షుడిగా కోదాటి రమణారావు, జూలపల్లి మండల అధ్యక్షుడిగా కొప్పుల మహేష్‌లు నియామకం కావడం గమనార్హం. వచ్చే నెలలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలను సంప్రదించకుండా మండల, పట్టణ అధ్యక్షులను నియమించడంతో ఆ రెండు వర్గాల మధ్య మరింత చిచ్చు రేపినట్లయ్యింది. ఈ విషయమై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేయనున్నామని గుజ్జుల వర్గీయులు తెలిపారు. అలాగే పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం రైతు సత్యాగ్రహ దీక్షను రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కార్యాలయంలో దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించగా, ఈ దీక్షకు జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి హాజరై పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ సాయంత్రం హాజరై నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గుజ్జుల వర్గీయులు ఆయన నివాస గృహం వద్ద దీక్ష చేపట్టారు. ఇరు వర్గాలకు చెందినవారు వేర్వేరుగా దీక్షలు నిర్వహించడం వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పెద్దపల్లిలో వర్గపోరు లేకుండా ఉండేందుకు ఇరు వర్గాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:51 AM